ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికిన సైనా నెహ్వాల్.. కారణం ఏంటంటే..?

భారత బ్యాడ్మింటన్ చరిత్రను మలుపు తిప్పిన లెజెండ్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ కెరీర్ నిశ్శబ్దంగా ముగింపు పలికింది. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా, ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలతో ఇక తాను ప్రొఫెషనల్ స్థాయిలో ఆడలేనని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా తీవ్ర మోకాలి నొప్పితో ఆటకు దూరంగా ఉన్న సైనా, తన శరీరం ఇక ఉన్నత స్థాయి పోటీలకు సహకరించడం లేదు అంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది. ఈ మాటలతో భారత క్రీడాభిమానుల గుండెల్లో ఒక యుగం ముగిసిన భావన కలిగింది.

రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలపాటు కఠిన సాధన చేయాల్సిన పరిస్థితుల్లో, గంట రెండు గంటలకే మోకాలి నొప్పి భరించలేనిదిగా మారిందని సైనా వెల్లడించింది. కార్టిలేజ్ పూర్తిగా దెబ్బతినడం, ఆర్థరైటిస్ సమస్యలు తన ఆటను అడ్డుకుంటున్నాయని చెప్పింది. ఇంతకంటే శరీరాన్ని బాధ పెట్టడం తనకు ఇష్టం లేదు. అందుకే చాలనుకున్నాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి.

హర్యానాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా జీవితం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత పూర్తిగా మారింది. తండ్రి ఉద్యోగ రీత్యా నగరానికి బదిలీ కావడంతో, స్థానిక భాష తెలియని పరిస్థితుల్లో ఒంటరితనం అనుభవించిన ఆమె, తల్లి కలను నిజం చేయాలనే లక్ష్యంతో బ్యాడ్మింటన్‌ను ఆశ్రయించింది. లాల్ బహదూర్ స్టేడియంలో మొదలైన ఆమె ప్రయాణం, తండ్రి చేసిన అనేక త్యాగాల సహకారంతో ప్రపంచ స్థాయికి చేరింది. కూతురు శిక్షణ కోసం తన పీఎఫ్‌ను ఖర్చు చేయడం, ప్రమోషన్లను వదులుకోవడం వంటి తండ్రి త్యాగం ఆమె విజయాలకు పునాదిగా నిలిచింది.

సైనా కెరీర్ భారత బ్యాడ్మింటన్‌కు చరిత్రను అందించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళగా గుర్తింపు పొందిన ఆమె, అదే ఏడాది వరల్డ్ జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. 2009లో ఇండోనేషియా ఓపెన్ గెలిచి సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2010 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం ఆమె ఖాతాలో చేరింది.

2012 లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకం సైనాను భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె పేరు లిఖితమైంది. 2015లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించి, ప్రకాశ్ పదుకొణే తర్వాత ఆ ఘనత అందుకున్న రెండో భారతీయురాలిగా నిలిచింది. మొత్తం 24 అంతర్జాతీయ టైటిల్స్ ఆమె కెరీర్‌కు గర్వకారణం.

సైనా సాధించిన విజయాలు క్రీడారంగానికే కాదు, కోట్లాది యువతకు స్ఫూర్తిగా మారాయి. ఆమె సేవలకు గుర్తింపుగా అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మ శ్రీ, పద్మ భూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నది. ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా, సైనా మాటలతో భారత బ్యాడ్మింటన్‌లో ఒక స్వర్ణయుగం ముగిసినట్టయింది. కానీ ఆమె పోరాట పటిమ, పట్టుదల మాత్రం తరతరాలకు ప్రేరణగా నిలుస్తూనే ఉంటుంది.