సచిన్ ఇంటిముందు నిరసనలు… భారతరత్న కాకపోతే పర్లేదు!

ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కు తాజాగా నిరసన సెగ తగిలింది. బాంద్రాలోని ఆయన ఇంటి ముందు పలువురు ఆందోళన కారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలకు దిగిన వారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనుచరులు కావడం గమనార్హం. ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ ఆన్ లైన్ జూదాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ వారంతా నిరసనకు దిగారు.

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ ఇంటి ముందు భారీగా నిరసనలు జరిగాయి. ప్రహార్‌ జనశక్తి పక్ష ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు (బచ్చూ కాడూ) తన అనుచరులతో కలసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతిష్ఠాత్మక భారతరత్న పురస్కార గ్రహీత అయిన సచిన్.. యువత జీవితాలను నాశనం చేసే ఆన్‌ లైన్‌ గేమ్స్‌ కు ప్రచారం చేయడం ఏంటని వారు నిలదీశారు.

ఇటీవల సచిన్ టెండుల్కర్ “పేటీఎం ఫస్ట్” అనే ఆన్‌ లైన్ గేమ్ కోసం ఒక యాడ్ లో నటించారు. వాస్తవానికి ఇదొక గేమింగ్ యాప్. అయితే ఇందులో గేమ్స్ ఆడడమే కాకుండా డబ్బులు పెట్టే ఆప్షన్ కూడా ఉంది.. తద్వారా డబ్బులు సంపాదించడం సంగతి దేవుడెరుగు… పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో ఇది జూదం అనేది వారి వాదన.

సాదారణంగా… ఇలాటి వాటిని ఫాంటసీ గేమ్స్ అని పిలుస్తున్నప్పటికీ.. అంటే ఇది కూడా జూదమే! దీంతో.. ఇలాంటి గేమ్స్ కు సంబంధించిన ప్రకటనల ప్రమోషన్ నుంచి సచిన్ తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యాడ్‌ లో నటించినందుకు గానూ సచిన్‌ కు ఇప్పటికే తాము నోటీసులు కూడా పంపించినట్లు ఆందోళనకారులు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఒక వేళ సచిన్ భారతరత్న గ్రహీత కాకపోయి ఉంటే తాము ఆందోళన చేసే వాళ్లం కాదని నిరసనకారులు తెలిపారు. ఇదే సమయంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని అనుకుంటే… తన భారతరత్నను వెనక్కి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నిరసనలకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆందోళన కారులను బాంద్రా పోలీస్ స్టేషన్‌ కు తరలించారు.