చాలా మందికి తరచూ తలెత్తే ఒక సందేహం ఏమిటంటే.. రాత్రి భోజనానికి అన్నం తినడం బాగుంటుందా లేక రోటీ తినడమే మంచిదా.. కుటుంబ సభ్యుల్లోనూ, స్నేహితుల్లోనూ ఈ వాదన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు తరచుగా నిపుణులను ఈ ప్రశ్న అడుగుతారు. నిజానికి అన్నం, రోటీ రెండూ మన భారతీయ వంటకాల్లో సమాన ప్రాధాన్యం పొందినవే. అయితే వాటి ప్రభావం మన ఆరోగ్య స్థితి, జీవనశైలి, జీర్ణశక్తి మీద ఆధారపడి ఉంటుంది.
గోధుమ పిండితో తయారయ్యే రోటీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, బి-విటమిన్స్‌తో పాటు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని నెమ్మదిగా అందించి, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర నియంత్రణకు రోటీ చాలా ఉపయోగకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులకు రోటీ ఒక మంచి ఆప్షన్. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రోటీ బాగా పనిచేస్తుంది, ఎందుకంటే అది ఆకలిని తగ్గించి అతిగా తినకుండా సహాయపడుతుంది. కానీ ఒక జాగ్రత్త తీసుకోవలని నిపుణులు సూచిస్తున్నారు.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి రాత్రివేళ రోటీ కొంచెం భారంగా అనిపించవచ్చు.
మరోవైపు, అన్నం తేలికగా జీర్ణమయ్యే ఆహారం. ముఖ్యంగా రాత్రివేళ అలసటగా ఉన్నవారికి లేదా భారమైన ఆహారం తినకూడదనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అన్నం తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్లు పెరుగుతాయి. ఇవి మనసుకు ప్రశాంతతనిచ్చి, మంచి నిద్రకు సహాయపడతాయి. అదనంగా, అన్నంలో సోడియం తక్కువగా ఉండటంతో అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది లాభకరం. కానీ ఇక్కడ ఒక రిస్క్ ఉంది ఎక్కువగా తెల్లబియ్యం తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కూడా అన్నం పరిమితంగా తీసుకోవాలి.
నిపుణులు చెబుతున్నది ఒక్కటే రాత్రి భోజనంలో అన్నం.. రోటీ ఏదైనా ఒకదానిని ఎంచుకోవడం కంటే, పరిమాణాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఇంకా, మీరు చేసే పనుల రకం కూడా ఆ ఎంపికపై ప్రభావం చూపుతుంది. రోజంతా శారీరక శ్రమ ఎక్కువగా చేసినవారు అన్నం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఆఫీస్ పనులు చేసే వారు, బరువు తగ్గాలనుకునే వారు రోటీ వైపు మొగ్గు చూపడం మంచిది.
మొత్తానికి అన్నం-రోటీ రెండింటికీ ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉండాలనుకుంటే రోటీ, తేలికగా జీర్ణమవ్వాలని కోరుకుంటే అన్నం సరైన ఎంపిక. కానీ ఏది తీసుకున్నా పరిమితంగా తినడమే ఆరోగ్య రహస్యం అని నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారం సాధారణ ఆరోగ్య సూచనల ఆధారంగా మాత్రమే. ఏదైనా ఆహారపు మార్పులు చేసేముందు వైద్యులను లేదా పోషక నిపుణులను సంప్రదించడం మంచిది.)
