గట్టిగా ప్లాన్ చేసిన కాంగ్రెస్… అనుకున్నట్లుగానే చేస్తున్న రేవంత్!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గరపడుతుండటంతో అన్నిపార్టీల అభ్యర్థులూ ముహూర్తాలు చూసుకుని రంగంలోకి దిగుతున్నారు. ఈ సమయంలో బీఆరెస్స్ ను ఎలాగైనా గద్దెదింపాలని ఫిక్సయిన కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా 16మంది అభ్యర్థులతో థర్డ్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన పోటీ స్థానాలను తెరపైకి తెచ్చింది.

నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గరపడుతుండడంతో 16 మంది అభ్యర్థులతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో క్రితం ప్రకటించిన రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇదే సమయంలో మరో నాలుగు స్థానాలు పెండింగ్‌ లో ఉంచింది. ప్రస్తుతానికి మూడు విడతల్లో కలిపి 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానం మాత్రం సీపీఐకి కేటాయించింది. కమ్యునిస్టులతో బంధాన్ని కంటిన్యూ చేస్తుంది.

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం కాంగ్రెస్ లక్ష్యాల్లో బీఆరెస్స్ ను ఓడించడం ఎంత ముఖ్యమో.. కేసీఆర్ ని కూడా ఎమ్మెల్యేగా ఓడించడం అంత ముఖ్యం అని బలంగా భావిస్తున్నాయి విపక్షాలు. ఈ క్రమంలో గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేంద్ర పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజా కాంగ్రెస్ జాబితా ప్రకారం కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు.

దీంతో ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నప్పటికీ… కేసీఆర్ పై తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక మొదటి రెండు జాబితాల్లోనూ పేరు ప్రకటించకుండా ఉంచిన నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని సీనియర్ నేత షబ్బీర్‌ అలీకి కేటాయించింది కాంగ్రెస్. ఇదే సమయంలో తాజాగా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి… చెన్నూరు నుంచి బాల్క సుమన్‌ పై పోటీ చేయనున్నారు.

ఇదే సమయంలో ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌ కు పటాన్‌ చెరు నుంచి అవకాశమిచ్చింది. ఇదే క్రమంలో… జుక్కల్‌ నుంచి తోట లక్ష్మీకాంతరావు, కరీంనగర్ నుంచి పురుమల్ల శ్రీనివాస్, బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి, సిరిసిల్లలో కె.కె.మహేందర్ రెడ్డి, నారాయణ ఖేడ్‌ లో సురేష్ షెట్కార్‌, ఇల్లందు కోరం కనకయ్య, డోర్నకల్ రామచంద్రునాయక్‌, వైరా నుంచి మాలోతు రాందాస్‌, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణను పోటీలో ఉంచింది.

వాస్తవానికి గతంలోనే ప్రకటించిన బోథ్‌, వనపర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్… బోథ్‌ అభ్యర్థిగా గతంలో వన్నెల అశోక్‌ ను ప్రకటించింది. ఇప్పుడు ఆయన స్థానంలో అడె గజేందర్‌ ను పోటీలో ఉంచింది. ఇక వనపర్తి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డిని తప్పించి మెగారెడ్డికి అవకాశమిచ్చింది. ఇదే సమయంలో చేవెళ్ల స్థానంలోనూ అభ్యర్థిని మారుస్తారని తెలుస్తోంది.

ఇక అభ్యర్థులను ప్రకటించాల్సిన నాలుగు స్థానాలూ… మిర్యాలగూడ, సూర్యాపేట, చార్మినార్, తుంగతుర్తి! వీటిలో సూర్యాపేట, తుంగతుర్తి సీట్ల కోసం పోటీ గట్టిగా నెలకొందని అంటున్నారు. ఇక చార్మినార్ స్థానంలో ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ లో చేరతారని.. అందుకే ఆ స్థానాన్ని పెండింగ్‌ లో ఉంచారని తెలుస్తోంది. ఇక మిర్యాలగూడ విషయంలో సీపీఎంతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే ఒకటి రెండు రోజుల్లో ఈ పని పూర్తయిపోద్ది!