తెలంగాణ ఎన్నికల్లో ప్రచారాలు పీక్స్ కి చేరాయి. అధికార విపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలకు తోడు హామీల వర్షంతో ఓటర్లను తడిచి ముద్దచేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ కుల సమీకరణలతో బిజీగా ఉంది. మరోపక్క బీఆరెస్స్ కి తామే ప్రత్యామ్నాయం అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలతో దూసుకుపోతుంది. ఈ సమయంలో మరోసారి 24 గంటల విద్యుత్ అనే అంశం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
తెలంగాణ ఎన్నికల్లో బీసీ సీఎం అనే నినాదం బీజేపీ ఎత్తుకుంటే… గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఈ సమయంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని, ఫలితంగా జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని బీఆరెస్స్ భావిస్తుంది. ఈ సమయంలో తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూలైలో అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. రైతులకు 3 గంటల కరెంటు చాలు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ సమయంలో రేవంత్ అమెరికాలో ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంతమంది సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అమెరికా నుంచి వచ్చిన అనంతరం అతనితో వివరణ ఇప్పిస్తామని తెలిపారు. మరోపక్క రేవంత్ వ్యాఖ్యలపై బీఅరెస్స్ మండిపడింది.
ఇందులో భాగంగా… కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటూ ఆందోళనలు చేపట్టింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారాలు హోరెత్తిన నేపథ్యంలో కరెంటు విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో తాజాగా మరోసారి 24 గంటల విద్యుత్ పై అలాంటి కామెంట్సే చేశారు రేవంత్. అందులో భాగంగా రైతులకు 3 గంటల విద్యుత్ చాలు అని కామెంట్స్ చేస్తూ.. అందుకు వివరణ ఇచ్చారు.
తాజాగా ఓ ఛానల్ నిర్వహించిన క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అమెరికా పర్యటనలో భాగంగా రైతులకు మూడు గంటల కరెంటు చాలంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ఇప్పటికి తాను మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తనకు కూడా వ్యవసాయం తెలుసని, తాను వ్యవసాయం చేశానని.. ఆ అనుభవంతోనే వివరణ ఇచ్చానని అన్నారు.
10 హెచ్.పీ. మోటార్ తో ఒక ఎకరం పొలానికి నీళ్లు పారాలంటే సుమారు గంట సమయం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 58 లక్షల కమతాల్లో సుమారు 95 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు మాత్రమే భూమిని కలిగి ఉన్నారని చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే… 95శాతం రైతులను దృష్టిలో పెట్టుకుంటే మూడు, నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తే సరిపోతుందని వివరణ ఇచ్చారు.
అనంతరం… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం 24 గంటలు విద్యుత్ ఇస్తామని.. ఇదే విషయాన్ని ప్రతి బహిరంగ సభలో చెప్తున్నామని తెలిపారు రేవంత్. ఇదే సమయంలో కేసీఆర్ తనపాలనలో ఇప్పటివరకూ 24 గంటల విద్యుత్ ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటానని సవాల్ చేశారు. దీంతో… ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
అయితే… 24 గంటలూ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పుడు ఓటర్లను కన్ ఫ్యూజ్ చేసేలా.. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా ఇలాంటి బోనస్ వ్యాఖ్యలు అవసరమా అనేది పలువురి అభిప్రాయంగా ఉంది. మరి ఈ మూడు గంటల విద్యుత్ వెనుక రేవంత్ ఇచ్చిన వివరణను ప్రజలు ఎలా తీసుకుంటారనేది వేచి చూడాలి!