అవ్వ తాతలకు మోడీ వెన్నుపోటు… బాగానే గిట్టుబాటైంది!

ఎలాంటి వారికైనా కాస్త పెద్దవయసు వారిని చూస్తే జాలేస్తుంది! రోడ్డు దాటించడం దగ్గరనుంచి వారికి ఏదైనా సహాయం చేయాలంటే అది అదృష్టంగా భావిస్తారు.. వారి ఆశిస్సులు పొందాలని ఆతృత పడుతుంటారు. అయితే… వృద్ధురాలైన తన తల్లి విషయంలో విపరీతమైన ప్రేమ చూపించే మోడీ… మిగిలిన అవ్వ తాతాలపై మాత్రం కక్ష గట్టారు. వారికి ఉన్న హక్కును, దశాబ్ధాలుగా వస్తున్న రాయితీని నిర్ధాక్షిణీయంగా ఎత్తేశారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడంలో మోడీ దిట్ట అనే కామెంట్లకు మరింత బలం చేకూర్చారు. ఫలితంగా… బాగానే సంపాదించారు!

గతకొంతకాలంగా మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై విపక్షాలు బలంగా విమర్శలు చేస్తున్నాయి. ప్రైవేటైజేషన్ విషయంలో కూడా మోడీపై దేశవ్యాప్తంగా బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో… సంపద సృష్టించాలంటే, ప్రజలకు ఉన్న సదుపాయాలను ఎత్తేయాలి అని భావించారో ఏమో కానీ… పండుటాకులను ఇబ్బంది పెట్టడాన్ని ఒక ఆదాయ మార్గం భావించారు మోడీ! ఈ విషయం తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది.

“వంద రోజుల్లో నల్లధనం వెనక్కి తెస్తానన్న” ప్రధాని మోడీ… ఎన్ని వందల రోజులు అవుతున్న ఆ పని మాత్రం చేయలేదు. చేతకాకో, చేవలేకో ఆ విషయాన్ని సైడ్ చేసేశారు. కానీ.. ఆ నల్ల ధనం వల్ల జాతికి కలిగిన నష్టాన్ని, వృద్ధుల నుంచి లాగాలని భావించారు మోడీ. అందులో భాగంగా… రైల్వే టిక్కెట్ ధరల్లో వృద్ధులకున్న సీనియర్ సిటిజన్ రాయితీని ఎత్తేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా… మోడీ సర్కార్ లైట్ తీసుకుంది. ఫలితంగా… ఏడాదికి వేల కోట్లు ఆర్జించింది!

అరవై ఏళ్లకు పైబడిన పెద్ద వయస్కుల వారికి గతంలో రైల్వేల్లో ప్రయాణించాలనుకుంటే.. వారి టికెట్ ధరల్లో యాభై శాతం వరకూ రాయితీ ఉండేది. రైల్వేల్లో 60 ఏళ్లకు పైబడిన పురుషులకు 40శాతం.. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50 శాతం చొప్పున టికెట్ రాయితీని ఇచ్చేవారు. అయితే మోడీ ఈ రాయితీని నిర్ధాక్షిణీయంగా తొలగించారు. కోట్లమంది వృద్ధుల కన్నీటికి కారణమయ్యారు. దీంతో 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి 31 మధ్య కాలంలో దాదాపు 8 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఈ రాయితీకి దూరమయ్యారు. ఈ రాయితీని ఎత్తేయటం కారణంగా రైల్వేలకు 2242 కోట్ల అదనపు ఆదాయం లభించింది!

మధ్యప్రదేశ్ కు చెందిన సమాచార హక్కు చట్ట కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన అప్లికేషన్ తో ఈ విషయం బయటకు వచ్చింది. పండుటాకులకు ఇబ్బంది కలిగిస్తూ.. వారికి భారం చేకూరేలా మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఏడాది వ్యవధిలో రైల్వేలు ఆర్జించిన మొత్తం 2242 కోట్లని తెలిసింది. దీంతో… ఇది మోడీ మార్కు అభివృద్ధిలో భాగమే అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. విపక్షాలు అన్నాయని కాదు కానీ… పెద్ద వయస్కుల వారి ఆత్మగౌరవానికి నిదర్శనంగా నిలిచే ఈ రాయితీని తీసేయటం ద్వారా మోడీ సర్కారు సాధించిందేంటి? డబ్బేనా… ఇంకేమైనా ఉందా? అవ్వ తాతల శాపం కూడానా?