ఆంద్రపదేశ్‌లో దేవాలయాల మీద దాడులు, ఈ క్రమంలో తెరపైకొచ్చిన మత రాజకీయాలు.. ఎంత నిస్సిగ్గుగా రాజకీయ పార్టీలు వ్యవహరించాయో చూస్తున్నాం. కొత్తగా, ఇప్పుడు తెలంగాణలోనూ మత రాజకీయాలు అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి చేరుకుంటున్నాయి. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కొందరు ఇంటింటికీ వెళ్ళి చందాలు వసూలు చేస్తున్న విషయం విదితమే. నచ్చినోళ్ళు విరాళాలు ఇస్తున్నారు, నచ్చనోళ్ళు ఇవ్వడంలేదు. కొన్ని చోట్ల బలవంతపు వసూళ్ళంటూ విమర్శలు వెల్లువెత్తతున్నాయి. అసలు అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాలు ఎందుకు ఇవ్వాలి.? అన్న చర్చ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వినిపిస్తోంది. పలువురు ప్రజా ప్రతినిథులు ఈ విషయమై చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ – టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వ్యవహారం భౌతిక దాడుల వరకు వెళుతోంది.
‘మేం గనుక, సంయమనం కోల్పోతే మీరసలు రోడ్ల మీద తిరగలేరు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, బీజేపీ నేతలకు అల్టిమేటం జారీ చేయడం గమనార్హం. నిజమే, అయోధ్య రామాలయ నిర్మాణం పేరుతో బలవంతపు వసూళ్ళు జరుగుతున్నాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, అలాగని.. కొందరు చేస్తోన్న ఈ కుట్రపూరిత చర్యలను నిలువరించాల్సింది పోయి, దీనిపై దుష్ప్రచారం ఎందుకు.? అన్నది కీలకమైన చర్చ. స్వచ్ఛంద విరాళాలే ఎక్కువుగా వున్నాయి.. ఎవరో ఒకరిద్దరు చేసే దుష్ట పన్నాగాలకి అందర్నీ నిందించడం సబబు కాదన్నది మెజార్టీ అభిప్రాయం. ఈ వ్యవహారంపై బీజేపీ ఎందుకు కల్పించుకుంటోంది.? అన్నది ఇంకో వాదన. అయోధ్య అనేది బీజేపీ పేటెంట్ హక్కు వ్యవహారం కాదు. రాములోరు.. అందరికీ దేవుడే. నిజానికి, భక్తి విషయానికొస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మించిన భక్తుడెవరున్నారన్నది టీఆర్ఎస్ ప్రశ్న. రెండు పార్టీల మధ్య గొడవ కాస్తా, ఓ మతంపై విషం చిమ్మే చర్యలకు తావిస్తున్న దరిమిలా.. ఇరు పార్టీలూ సంయమనం పాటించడం మంచిది.