ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల విబేధాలు తారా స్థాయిలో ఉన్నాయన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. రాష్ట్ర రాజకీయాలను ఈ కులాలే శాసిస్తున్నాయి. ఇక్కడ శాసిస్తున్నాయి అనడం కంటే శాసించేలా చేస్తున్నారని అనడం కరెక్ట్. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా ఇదే ఫార్ములా. పార్టీని నడిపే వ్యక్తి ఏ కులానికి చెందిన వ్యక్తి అయితే కులం మద్దతు ఆ పార్టీకి పుష్కలంగా ఉంటుంది. దాదాపు చాలా నియోజకవర్గాల్లో కులమే పార్టీల గెలుపోటములను డిసైడ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ కులం ఓటర్లు ఎక్కువ ఉంటే ఆ కులమే అధికారం ఎవరి చేతిలో ఉండాలో నిర్ణయిస్తోంది.
రాష్ట్రంలోని కమ్మ, కాపు, రెడ్డి ఇలా జనం ఎక్కువగా ఉన్న కులాలే గెలుపోటముల్లో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు కులాలు మూడు పార్టీల మధ్యన చీలిపోయి కొట్టుకుంటున్నాయి. కులం చూడం, కుల వ్యవస్థను నిర్మూలిస్తాం అంటూ రాజకీయాల్లోకి దిగిన నాయకులు ఈ కుల విధానానికి ఎప్పుడో అలవాటుపడిపోయారు. రాష్ట్ర వెనుకబాటుతనానికి ఈ కుల పిచ్చి పెద్ద ఆటంకంలా మారిందనేది నూటికి నూరు శాతం నిజం. ఈ కుల పిచ్చితోనే చస్తుంటే కొత్తగా రాష్ట్రంలో మత చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయి.
రథం దగ్దమై మతం అంటుకుంది:
నిన్న శనివారం అర్థరాత్రి తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని ప్రఖ్యాత లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతైంది. భద్రంగా ఒక షెడ్డులో నిలిపి ఉన్న రథం ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటల్లో కాలి బూడిదైంది. దీంతో హిందూ భక్తులు చాలా బాధపడుతున్నారు.
అనుమానాస్పద రీతిలో జరిగిన ఈ ప్రమాదం చుట్టూ అనేక వివాదాలు రాజుకున్నాయి. ప్రతిపక్షాలు అధికార పక్షం మీద ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టాయి. ఇదెప్పుడూ జరిగే ప్రక్రియే అయినా ఈసారి దేవాలయం, భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి మతం ఇన్వాల్వ్ అయింది. దానంతట అది కాలేదు లెండి. బలవంతంగా దాన్ని గొడవలోకి లాగారు.
రథం దగ్దమైందని తెలియగానే అన్ని పార్టీల నేతలు అక్కడ వాలిపోయారు. బీజేపీ, టీడీపీలు హడావుడి మొదలుపెట్టేశాయి. ఇది ప్రమాదం కాదని ఖచ్చితంగా కుట్రేనని తేల్చి పారేసిన రాజకీయ నాయకులు దీనికి వెనుక మత శక్తులు ఉన్నాయని అంటున్నాయి. ఇది ఖచ్చితంగా హిందూ మతం మీద జరుగుతున్న విధ్వంసక చర్యని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మామూలుగా అయితే మత ప్రస్తావన వచ్చేది కాదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ హిందూ మతంపై దాడి అనే వాదన తెరపైకి వచ్చింది. వైఎస్ జగన్ సీఎం పీఠం ఎక్కిన రోజు నుండి ఏదో ఒక మూల నుండి ఈ మత వాదన తెరపైకి వస్తూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం జరుగుతుందనే ఆరోపణలను, టీటీడీ ఆస్తుల వేలం వేయాలని టీటీడీ బోర్డ్ అనుకోవడం వంటి వాటిని భూతద్దంలో చూపి హిందూ మతం మీద క్రిస్టియానిటీ దాడి అనే కలరింగ్ ఇద్దామనుకున్నారు కొందరు. కానీ అది సాధ్యపడలేదు.
ఉత్తరాధి పైత్యం మాకొద్దు
మతపరమైన రాజకీయాలకు ఉత్తరాది రాష్ట్రాలు పెట్టింది పేరు. జాతీయ పార్టీ బీజేపీ పునాదులు మత రాజకీయాల మీదే ఏర్పడ్డాయి. వాటిని అడ్డం పెట్టుకునే భావోద్వేగ రాజకీయాలు నెరుపుతూ హిందువులను రాజకీయంగా వాడుకుంటోంది ఆ పార్టీ. ప్రతి అంశాన్ని మతం కోణం నుండి చూడటం ఉత్తరాది జాతీయ పార్టీలకు అలవాటు. హిందువుల పక్షాన నిలబడటం తప్పేమీ కాదు. కానీ ఇతర మతాల వారి పట్ల వివక్ష చూపడం, దాని ద్వారా మెజారిటీ జనం ఉన్న మతాన్ని ఆకట్టుకోవడమే తప్పు. బయటకి కనబడవు కానీ హిందూ మతాన్ని పరిరక్షిస్తున్నాం అంటూ బీజేపీ చేసే మతపరమైన దాడి అంతా ఇంతా కాదు. అది అవతలి మతం వారికే తెలుస్తుంది.
ఇప్పుడు ఇదే రకమైన రాజకీయం ఆంధ్రాలో కూడ నెరపాలనేది సదరు జాతీయ పార్టీ ఉద్దేశ్యం కావొచ్చు. అందుకే ప్రతిసారి హిందూ మతాన్ని, హిందూ భక్తుల మనోభావాలను తెరపైకి తెస్తూ విషయాలను పెద్దవి చేయాలని చూస్తున్నారు. ఆ పార్టీతో అంటకాగుతున్న అధికార పార్టీ ఎంపీ సైతం ఇది మతపరమైన దాడి అనే అనుమానం ఉందని, వైఎస్ జగన్ క్రైస్తవుడు కాబట్టి ఆయనకు హిందూ పురాణాల గురించి, సంప్రదాయాల గురించి అంత అవగాహన లేకపోవచ్చని అన్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో జగన్ హిందువు కాదు క్రైస్తవుడు. ఇది హిందూ మతం మీద జరిగిన దాడి అనే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఇక వారికి టీడీపీ కూడా సరిగ్గా తోడైంది. ఇది హిందూ మతం మీద ఇంకో మతం చేస్తున్న దాడేనని, దానికి వైఎస్ జగనే బాధ్యత వహించాలని అంటోంది. ఒకవేళ ఇదే పరిణామం చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ఇలాగే మత రాజకీయం చేసేవారా..? వైఎస్ జగన్ అన్యమతస్తుడు కాబట్టే ఈ మత చిచ్చు కుట్ర జరుగుతోంది. కానీ ఈ తరహా కుట్రలు లౌకికవాదం మెండుగా ఉన్న ఏపీలో ఎప్పటికీ పనిచేయవనే వాస్తవాన్ని కూడ గుర్తెరగాలి వారు.