YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం తలపెట్టిన రెండో విడత భూసేకరణ నిర్ణయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబడుతూ.. ఇది రాజధాని నిర్మాణంలా లేదని, రియల్ ఎస్టేట్ మాఫియాను తలపిస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలు సంధించారు.
“మింగ మెతుకు లేదు..” ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె కావాలా?” అన్న సామెత చందంగా బాబు పాలన ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తొలి విడతలో రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాలు, ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 54 వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయని గుర్తు చేశారు. అందులో కనీసం ఒక్క కిలోమీటర్ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని, ఐకానిక్ భవనాల ఊసే లేదని విమర్శించారు. ఉన్న భూములే అభివృద్ధి చేయలేనప్పుడు, కొత్తగా మరో 16 వేల ఎకరాలు ఎందుకని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.

గణాంకాలతో గట్టి కౌంటర్ రాజధాని అవసరాల పేరుతో సేకరిస్తున్న భూముల విస్తీర్ణంపై షర్మిల అనుమానాలు వ్యక్తం చేశారు. దేశ, విదేశీ నగరాలతో పోలుస్తూ ఆమె లేవనెత్తిన అంశాలు. రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయానికి 1850 ఎకరాలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 2200 ఎకరాలు సరిపోగా.. అమరావతికి 5 వేల ఎకరాలు ఎందుకు? లండన్, బీజింగ్ వంటి ఒలింపిక్ నగరాల్లో స్పోర్ట్స్ సిటీలు 150 ఎకరాల్లో ఉండగా.. అమరావతిలో 2500 ఎకరాలు ఎందుకు? అదానీ, అంబానీల కోసమేనా? ఈ భారీ భూసేకరణ వెనుక కార్పొరేట్ శక్తుల ప్రమేయం ఉందని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. కేవలం అదానీ, అంబానీలకు బాకీ పడ్డారని, వారికి కట్టబెట్టేందుకే ఈ భూములను సేకరిస్తున్నారా అని ప్రశ్నించారు.
రాజధాని భూముల స్థితిగతులపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విపక్షాల, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి.
కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు విభజన హామీలు, నిధుల గురించి అడగకుండా శాలువాలు కప్పి సన్మానాలు చేయడం సిగ్గుచేటని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రెండో విడత భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

