చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ప్రవర్తిస్తున్న ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాక్ ఇస్తూ నిన్న ఆయన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఈ నెల ఇరవై ఒకటో తారీకు వరకు గృహనిర్బంధంలో ఉంచాలని ఇచ్చిన ఆదేశాలను చెత్తబుట్టలో పడేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. రాజ్యాంగబద్ధమైన పదవికి మచ్చతెచ్చేలా ఇష్టమొచ్చినట్లు మీడియాసమావేశాలు నిర్వహిస్తూ అధికారులను, మంత్రులను బెదిరిస్తూ ఉన్మాదిలా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు తీర్పు ఏమాత్రం జీర్ణించుకోలేనిదే. పంచాయితీరాజ్ శాఖామంత్రిగా రాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన ఒక మంత్రిని గృహనిర్బంధంలో ఉంచాలని డిజిపికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు ఆయన బరితెగింపుకు నిదర్శనం. రాజ్యాంగ సంప్రదాయాలను, మర్యాదలను నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారనేది నిర్వివాదాంశం. కొన్ని పచ్చ క్షుద్రపత్రికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను భారత మాజీ ఎన్నికల ప్రధాన కమీషనర్ టి ఎన్ శేషన్ తో పోల్చుతూ మళ్ళీ అంతటి ఘనుడు తెలుగుదేశంలో దొరికాడని డప్పు కొడుతుండగానే నిమ్మగడ్డ ఆదేశాలను కొట్టేస్తూ కోర్ట్ తీర్పు వెలువరించడం మంత్రికి పెద్ద ఊరట ఇచ్చే విషయం.
ఎన్నికల కమీషన్ ను హైకోర్టు, సుప్రీమ్ కోర్ట్ అనేక సందర్భాల్లో సమర్ధించాయి. అంతమాత్రాన ఎన్నికల కమీషనర్ రాబోయే రెండు మూడునెలలు రాష్ట్రం మొత్తానికి సర్వం సహాధిపతి అని కోర్టులు ప్రకటించలేదు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను సరైన రీతిలో అర్ధం చేసుకుని ఎన్నికలను సజావుగా పూర్తిచెయ్యాల్సిన నిమ్మగడ్డ అందుకు భిన్నంగా వైసిపి నేతల మీద ఆంక్షలు విధిస్తూ, ఏకగ్రీవాలను తప్పు పడుతూ, అధికారులపై ఆంక్షలు పెడుతూ చెట్టుకు చీడ పట్టినట్లు వ్యవహరించడం సిగ్గు చేటు. ఆయన ముమ్మాటికీ చంద్రబాబు చెప్పినట్లు డాన్స్ చేస్తున్నారనడంలో సందేహమే లేదు.
చిత్తూర్ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు ఆగర్భశత్రువు. ఆయనకు ఆ జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టు ఉన్నది. ఆయన ఒక్కమాట చెపితే చాలు వందల సంఖ్యలో ఏకగ్రీవాలు అవుతాయి. చిత్తూర్ చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికీ అక్కడ తెలుగుదేశం వెనుకబడిపోతున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపిని ఎలాగైనా కట్టడి చెయ్యాలనే దురుద్దేశ్యంతో చంద్రబాబు నిమ్మగడ్డను పావుగా వాడుకుంటూ ఎన్నికలను శాసిస్తున్నారు. ఆ వరుసలోనే పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించడానికి నిమ్మగడ్డ తెగించారు. ఆయనకు అలాంటి అధికారం లేనేలేదు.
సహజంగానే పెద్దిరెడ్డి కుపితుడై నిమ్మగడ్డ ఆంక్షలను తాను లెక్కచేయబోనన్నాడు. నిమ్మగడ్డ అక్రమ ఆదేశాలను పాటించాలని ప్రయత్నించే అధికారులకు తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. అలాగే నిమ్మగడ్డ కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై సంజాయిషీ ఇచ్చుకోక తప్పదని, అంతేకాక ఆయన మూడేళ్ళ పాటు జైల్లో ఉండక తప్పదని తీవ్రంగా హెచ్చరించడంతో ఎన్నికల కమీషన్, ప్రభుత్వాల మధ్యన మొదలైన యుద్ధం ఇప్పట్లో సమసేది కాదని తేలిపోయింది. కోర్టుకు వెళ్లిన పెద్దిరెడ్డికి తగిన న్యాయం లభించింది. అయితే ఆయన మీడియా సమావేశాల్లో ప్రసంగించకూడదని నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు మాత్రం అమల్లో ఉంటాయి. అయితే ఇక్కడ మీడియా ముందు ఉపన్యాసాలు ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. నిమ్మగడ్డ విధించిన అక్రమ ఆంక్షలను కోర్టు కొట్టేయడం పెద్దిరెడ్డికే కాక ప్రభుత్వానికి కూడా పెద్ద ఉపశమనంగానే భావించాలి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు