మోడీని వెంటాడుతోన్న రాహుల్… తెరపైకి చిల్లర రాజకీయం!

మణిపూర్ ఘటనపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే.

అవిశ్వాస తీర్మానం పెట్టిందే మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ మౌనవ్రతం వీడాలని. బాధ్యత కలిగిన ప్రధానిగా ఆ ఘటనపై స్పందించాలని. అయితే ప్రధాని మోడీ మాత్రం… కాంగ్రెస్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టినట్లు, ఆయన ప్రతిపక్ష సభ్యుడైనట్లు ప్రసంగించారు. దీంతో ప్రధాని ప్రసంగంపై పెదవి విరుస్తున్నారు మేధావులు.

ఈ సమయంలో ప్రధానిపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌ సభలో నవ్వుతూ కనిపించిన ప్రధానికి దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? అంటూ నిలదీశారు. సైన్యానికి అవకాశం ఇస్తే రెండు రోజుల్లో మణిపూర్‌ పరిస్థితిని సరిదిద్దేది. నిప్పుల గుండం లాంటి మణిపూర్‌ను చల్లార్చాల్సింది బోయి బీజేపీ.. మరింత ఆజ్యం పోసింది అని రాహుల్ గాంధీ మండిపడ్డారు

ఇదే క్రమంలో… ప్రధానిగా మోడీ కనీసం మణిపూర్‌ కు వెళ్లాల్సింది. అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది. “నేను మీ ప్రధాని.. ఎలాంటి సమస్య ఉన్నా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుందాం” అని ఆయన అనాల్సింది. కానీ… ఆయనలో అలాంటి ఉద్దేశం ఏం కనిపించడం లేదు అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.

ఇదే ఫ్లో కంటిన్యూ చేసిన రాహుల్ గాంధీ… మణిపూర్‌ లో భారతమాతను హత్య చేశారు అని ఊరికే అనలేదని తెలిపారు. “బీజేపీ మణిపూర్‌ ను, భారత్‌ ను హత్య చేసి.. రెండుగా చీల్చింది.. మణిపూర్‌ మండుతుంటే, ప్రజలు చనిపోతుంటే.. మోడీ మాత్రం నవ్వుతూ పార్లమెంట్‌ లో కనిపించారు.. మణిపూర్‌ ఇష్యూను తమాషాగా మార్చారు” అంటూ ఫైరయ్యారు.

ఇక్కడ ప్రశ్న 2024లో మోడీ మళ్లీ ప్రధాని అవుతారా? కాదా? అనికాదు.. మణిపూర్‌ లో జనాల్ని, పిల్లల్ని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.. ఈ సమయంలో చిల్లర రాజకీయ నాయకుడిలా కాకుండా.. ప్రధాని తన వెనుక ఉన్న భారతీయ ప్రజల గుండెబరువుతో మాట్లాడాలి. కానీ, మోడీ అలాకాకుండా వ్యవహరించడం బాధాకరం అంటూ చీల్చి చెండాడారు రాహుల్ గాంధీ!

కాగా లోక్‌ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. తన ప్రసంగంలో ఎక్కువ భాగం విపక్షాలపైనా, ప్రత్యేకించి కాంగ్రెస్‌ పైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతే తప్ప మణిపూర్ ఘటనపై మాట్లాడలేకపోయారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా వ్యవహరించారని అంటున్నారు. .

ఆ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. తీవ్రస్థాయిలో ప్రధానమంత్రి వైఖరిని తప్పుపట్టారు!