ఇష్…క్షుద్రజ్యోతి రాధాకృష్ణ మానసిక పరిస్థితిని ఏమాత్రం చూడలేకపోతున్నాం. కుడివైపు తిరిగితే గోడదెబ్బ…ఎడమచేతివైపు తిరిగితే చెంపదెబ్బ అన్న విధంగా అటు తెలంగాణాలో కేసీఆర్ ను చూస్తే భయం, ఇటు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని చూస్తే వణుకు…ఈ రెండింటిని కప్పిపుచ్చుకోలేక, ఏదో ఊడబొడుస్తాడనుకుంటే చంద్రబాబు నిర్వాకం కారణంగా ఢిల్లీ దేవుడు మోడీతో కూడా విరోధం…వెరసి..ప్రజానాయకులను సమర్ధించలేక, వెన్నుపోటు దేవుడిని వ్యతిరేకించలేక రాధాకృష్ణ అనుభవిస్తున్న ప్రసవవేదన సామాన్యమైనది కాదు….
కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ వీరు ముగ్గురూ ప్రజల మనసులలోనుంచి గెలిచి అధికారం సాధించిన నాయకులు. చంద్రబాబు చూస్తే కేవలం మామగారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుని, కుటుంబంలోనే కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచి అధికారలక్ష్మిని చెరపట్టిన ప్రజాస్వామ్య హంతకుడు. దొంగబుద్ధి, దోపిడీ బుద్ధి కాబట్టే లక్షలకోట్ల ప్రజాసంపదను దోచుకుని, దానిలో తన భజనగాళ్ళు, అక్షరహంతకులు రామోజీ రావు, రాధాకృష్ణ లాంటి వారిని కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి ప్రజలు నెత్తిన పెట్టుకున్న నాయకులపై అనునిత్యం బురదను చిమ్మిస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. అలాంటి చంద్రబాబు మన బాధాకృష్ణ పాలిటి దేవుడు. ప్రజల కోసం సంక్షేమపథకాలు అమలు చేసే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దుర్మార్గులు! తన ఆవేదనను, మనోవేదనను కొత్తచెత్తపలుకులో ఈవారం ఎలా కక్కాడో కొన్ని అంశాలను పరిశీలిద్దాం.
ఇప్పుడు మన రాధాకృష్ణకు కావలసిందేమిటి? అర్జంటుగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు మోడీతో యుద్ధం చెయ్యాలి. మోడీని తిట్టాలి. వైరాన్ని ప్రదర్శించాలి. అందుకోసం వారిద్దరిని పిరికివారుగా, భీరువులుగా చిత్రిస్తూ రెచ్చగొడుతుంటాడు. వారిద్దరూ రెండు రాష్ట్రాలకు ఎన్నికకాబడిన ప్రతినిధులని, కేంద్రప్రభుత్వంతో సయోధ్య నెరపుతూ రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాలను సాధించడమే వారి బాధ్యత అనే ప్రజాస్వామ్య వాస్తవాన్ని విస్మరించి కేసీఆర్ ఢిల్లీ వెళ్లడాన్ని తప్పు పడతాడు. మోడీ ముందు కొద్దిగా తలవంచి నమస్కరిస్తే “చూసారా…మోడీ కి కేసీఆర్ లొంగిపోయాడు” అని కీచురాయిలా అరుస్తాడు.
మనకన్నా పెద్దలు, పెద్ద హోదా కలిగినవారిముందుకు వెళ్ళినపుడు కొద్దిగా తలవంచి నమస్కరించడం మన భారతీయ సంప్రదాయం. “శిరసానమామి” అన్నారు ఆర్యులు. కొంచెం శిరసు వంచడం అనేది వారు మనకన్నా అగ్రస్థానంలో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం. పెద్దలకు, పీఠాధిపతులకు, సన్యసించినవారికి, ఋషులకు ఎవరెవరికి ఎలా గౌరవనమస్కారం చెయ్యాలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. కిరోసిన్ అమ్ముకుని బతికినవాడికి, చదువుసంధ్య లేని నిరక్షరకుక్షులకు అలాంటి సంప్రదాయాలు ఎలా తెలుస్తాయి. అందుకే విద్యావంతుడు, సనాతన సంప్రదాయాల పట్ల అభినివేశం, భక్తిప్రపత్తులు కలిగిన కేసీఆర్ లాంటివారిని తప్పు పట్టడానికి సాహసిస్తాడు. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళింది మోడీ కాళ్ళు పట్టుకోవడానికి అన్నట్లు ఎద్దేవా చెయ్యడానికి తన మనసులోని కశ్మలాన్ని భళ్లున వాంతి చేసుకున్నాడు!
ఇక జగన్మోహన్ రెడ్డి మీద తన అక్కసును ఎలా ప్రదర్శించాడో చూద్దాం.
`ఇంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలను దేవుళ్ల తరహాలో పల్లకిలో ఊరేగిస్తూ తీసుకుపోతున్నారు. దేవాలయాల్లో భజనలు చేసినట్లుగా ఆయనకు భజనలు చేస్తున్నారు’
అడ్డెడ్డెడ్డే..తన కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాడి కంట్లో నలుసును వెతకడం అంటే ఇదే కదా! ఎనభై మూడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చిత్తుకాగితాల్లా ఖర్చు చేసేసే “జయము జయము చంద్రన్నా” అంటూ విగ్రహపుష్టి..నైవేద్యనష్టి అన్నట్లు నయాపైసా విలువ చేసే పనులు కూడా చెయ్యని చంద్రబాబుకు భజన బృందాలు చేసిన బృందగానాలు రాధాకృష్ణ మర్చిపోయినట్లున్నాడు!
‘ఇదంతా నిజమని నమ్మి జగన్ కూడా తనకు తానే దేవుడిగా ప్రకటించుకుంటారేమో తెలియదు.’
అవును గదా…జయము జయము అంటూ చిడతలు కొట్టిన వారి స్తోత్రాలని నమ్మేసి చంద్రబాబు నిజంగా తాను పోలవరాన్ని కట్టినట్లు, బులెట్ రైళ్లు తెచ్చినట్లు, అమరావతిని, నవనగరాలను నిర్మించేసినట్లు ఎంత భ్రమపడ్డాడో, ప్రజలను భ్రమల్లో ఉంచడానికి పచ్చ మీడియా ఎంత తపన పడిందో మనకు తెలియదా?
“””సినిమాల్లో దేవుడి పాత్రలు వేసిన ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోకి రాకముందు కూడా అభిమానులు పాదాభివందనం చేసేవారు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాదాభివందనాలను ఆయన ఇష్టపడేవారు. ఈ కారణంగా అనర్హులను కూడా ఆయన అందలమెక్కించిన సందర్భాలున్నాయి. “”””
వాస్తవాలని ఒక్కోసారి తెలిసో తెలియకో కక్కేస్తాడు రాధాకృష్ణ. ఎన్టీఆర్ అనర్హులను అందలం ఎక్కించారనడానికి ఉదాహరణగా ఆయన దశమగ్రహం చంద్రబాబు నాయుడు ఎదురుగా ఉండగా ఇక రాధాకృష్ణను ఎలా తప్పు పడతాము?
“””ఇక చట్టసభల్లో ఒకరిద్దరు మంత్రులు, శాసనసభ్యులు వాడిన భాష పట్ల కూడా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వయసుని, అనుభవాన్ని కూడా గుర్తించకుండా అరేయ్, ఒరేయ్ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబును దూషించడం వల్ల ఆయనకు పోయేదేమీ ఉండదు. అయితే మంత్రులుగా ఉంటున్నవారు అలా దూషించడమేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.””””
ఆహా ..ఆహా…ఏమి పత్తిత్తు కబుర్లు! గౌరవ శాసనసభలో కళ్లెర్రజేస్తూ, ముఖాన్ని కందగడ్డను చేస్తూ “అరేయ్…నా కొడకా…పాతేస్తా…నరికేస్తా…” అన్న పచ్చ నాయకుల దూషణలు మన రాధాకృష్ణ కు భూషణలుగా కనిపించి ఉంటాయి. ఇక చంద్రబాబు గారు మన దేశ ప్రధాని అన్న కనీస గౌరవం కూడా లేకుండా టెర్రరిస్ట్, ఉన్మాది, పెళ్ళాన్ని వదిలేసినవాడు, చాయ్ అమ్ముకునే వాడు, కుటుంబం లేనివాడు, తల్లిని రోడ్డు మీద పడేసినవాడు” అంటూ వదరుబోతుతనాన్ని ప్రదర్శిస్తే అవి సుభాషిత శ్లోకాలుగా వినిపించి ఉంటాయి!
“”” మన పనితనాన్ని బట్టి మనకు కొలువు దొరుకుతుంది. ఎవరు ఎందులో నిపుణులో అందుకు తగ్గ కొలువులో వారిని నియమించుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఇతరులను దూషించగల సామర్థ్యం, నైపుణ్యం ఉన్నవారు కావాల్సి వచ్చిఉంటారు. బహుశా అందుకే కొడాలి నాని, అనిల్‌కుమార్ వంటి వారిని మంత్రులుగా నియమించుకున్నారు.””””
పాపం! జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత సానుభూతో! దేవినేని ఉమా, బోండా ఉమా, జెసి బ్రదర్స్, లోకేష్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఆదినారాయణ, వంగలపూడి అనిత, లాంటి మహాకవులు జగన్ మీద పారేసుకున్న నోటికంపు మొత్తం కాళిదాసు మేఘసందేశం, పోతన భగవతంలా ఆహ్లాదంగా, పవిత్రంగా కనిపించి ఉంటాయి. ఆనాడు తెలుగు తమ్ముళ్లు వాగిన వాగుడులో వెయ్యోవంతు కూడా నేటి వైసిపి నాయకులు, మంత్రులు మాట్లాడలేకపోయారు అని ప్రజలు భావిస్తున్నారు.
మరో పదేళ్ళపాటు రాధాకృష్ణ ఇలా రక్తాశ్రువులు కాల్చక తప్పదేమో! హు…ఏం చేద్దాం! ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు కదా….