గత మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. ఈ రక్తపాతం ఎప్పటికైనా ఆగాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈ యుద్ధానికి శాంతి ఒప్పందం కుదిర్చి ఎండ్ కార్డు పెట్టాలని ముందుకు వచ్చారు. ఆ దిశగా ఆగస్టు 15న అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంపై అంతర్జాతీయ దృష్టి నిలిచిపోయింది.
అయితే ఈ భేటీకి కొన్ని గంటల ముందు పుతిన్ చేసిన ఒక పని.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన నేరుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకారం, ఈ సంభాషణలో ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు కీలక సహాయం అందించారని, కుర్క్స్ ప్రాంతం స్వాధీనం చేసుకోవడంలో వారిది ముఖ్యపాత్ర అని పుతిన్ కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించారు.
ఇక రష్యన్ మీడియా ప్రకారం, ఈ కాల్‌లో పుతిన్ ట్రంప్ భేటీకి సంబంధించిన వివరాలు కూడా కిమ్‌తో పంచుకున్నట్లు చెబుతున్నారు. ఇరు నాయకులు భవిష్యత్తులో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. గత ఏడాది జూన్‌లో పుతిన్ ప్యోంగ్యాంగ్ పర్యటన సందర్భంగా, దాడి జరిగితే పరస్పరం సైనిక సహాయం అందించాలనే.. యుద్ధ కాలం నాటి ఒప్పందాన్ని పునరుద్ధరించారు. అప్పట్లో కిమ్‌ను మాస్కోకు ఆహ్వానించారు.
ఇదిలా ఉంటే, రాబోయే ట్రంప్ భేటీలో పుతిన్ ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న దొనెట్స్కోలోని మిగిలిన 30% భూభాగాన్ని రష్యాకు అప్పగించాలని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఈ ప్రతిపాదనను తిప్పికొట్టారు. అలా చేస్తే రష్యా భవిష్యత్తు దాడులకు ఆ ప్రాంతం కేంద్రమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ ఒకేసారి చోటుచేసుకోవడంతో, ట్రంప్ భేటీ యుద్ధానికి ముగింపు తేవగలదా లేదా అనేది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. పుతిన్.. కిమ్ గోప్య సంభాషణ, ట్రంప్‌తో కీలక చర్చలు ఈ మూడో యుద్ధం ఎటు మలుపు తిప్పనుందో ఇంకా అనిశ్చితంగానే ఉంది.
