కొరివితో తల గోక్కున్న బీజేపీ

Prime Minister insulted Telangana
హైదరాబాద్ నగర కార్పొరేషన్ కు మరో కొద్ది గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.  సుమారు డెబ్బై లక్షలమంది ఈ యజ్ఞంలో ఋత్విక్కులుగా మారబోతున్నారు.  అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లాయి.  గతంలో ఎన్నడూ లేనివిధంగా భాజపా తరపున కేంద్రం నుంచి హేమాహేమీలు ప్రచారయుద్ధంలోకి లంఘించారు.  వాగ్దానాల వర్షాలు పెనుతుఫానుగా మారి నగరం మొత్తాన్ని ముంచెత్తుతున్నాయి.  నింగిలోని చందమామను సైతం తెచ్చి మీ ఇంట్లో పెట్టెస్తాము అన్న చందాన పార్టీలన్నీ వరాల జల్లులు కురిపిస్తున్నాయి.  ఇక ఉచితాలకు హద్దే లేదు.  వరద సాయం మేము పదివేలు అని ఒక పార్టీ అంటే మేము పాతికవేలు అని మరొక పార్టీ అంటోంది.  మీరు ఇచ్చేదేమిటి…మా ప్రతాపం చూడండి అని మా పాట ఇంటికి యాభై వేలు అని మరొక శతాధిక వృద్ధ పార్టీ గొంతు చించుకుంటోంది.  ఇక రైళ్లలో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు, కరెంట్ బిల్లు రద్దులు, ట్రాఫిక్ చలానాలు రద్దులు అని ఒక ప్రముఖ పార్టీ ఊరిస్తున్నది. నగరంలో మీ ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడిపినా ఏ ట్రాఫిక్ పోలీసు మీ జోలికి రాడు అంటూ బాద్యత కలిగిన పార్టీలు కూడా పిచ్చ కామెడీలు ప్రదర్శిస్తున్నాయి.  
 
Prime Minister insulted Telangana
Prime Minister insulted Telangana
ఇక టీఆరెస్ నుంచి మంత్రి కేటీఆర్ సారధ్యంలో దాదాపు అందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దూకారు.  కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్ పార్టీలు కదన కుతూహలాన్ని ప్రదర్శిస్తూ ఒకరిమీద మరొకరు నిప్పులు చిమ్ముకుంటున్నారు.  దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘు నందన్ రావు వారం రోజుల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి  మరణంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపడంతో ఆయన కొంచెం వెనక్కు తగ్గినట్లున్నారు.  గత అయిదారు రోజులుగా మీడియాలో ఆయన గొంతుక వినిపించడంలేదు.  సీమాంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ నానా తంటాలు పడుతున్నది.  
 
ఇదిలా ఉండగా ఈరోజు హఠాత్తుగా ప్రధానమంత్రి మోడీ హైద్రాబాద్ పర్యటనను పెట్టుకోవడం సంచలనం సృష్టించగా, ఆ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై లను ప్రధానిని స్వాగతించడానికి విమానాశ్రయం రావద్దని ప్రధానమంత్రి కార్యాలయం పంపిన కబురు తెలంగాణ ప్రజల మనస్సులో అగ్నిగుండం గా మారింది.  దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వస్తున్నపుడు ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి తో పాటు కొందరు మంత్రులు, ఎంపీలు విమానాశ్రయంలో స్వాగతం పలకడం ఒక సంప్రదాయం.  అలాగే ప్రధాని పాల్గొంటున్నది అధికారిక కార్యక్రమమే తప్ప ప్రయివేట్ కార్యక్రమం లేదా పార్టీ కార్యక్రమం కాదు.  వాక్సిన్ పురోగతి పరిశీలన అనేది కేద్రానికి ఎంత ముఖ్యమో రాష్ట్రానికి కూడా అంతే ముఖ్యం.  నిజానికి ఆ కార్యక్రమంలో ప్రధానితో పాటు పాల్గొనమని ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించాలి.  అదేమీ లేకపోగా, ప్రధానమంత్రికి ప్రోటోకోల్ స్వాగతం పలకడానికి కూడా ముఖ్యమంత్రి రానవసరం లేదని చెప్పడం అంటే అది తెలంగాణను అవమానించడంగానే భావించాలి.  ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలోని మొత్తం జనాభా  నాలుగున్నర కోట్ల మందికి  ప్రతినిధి.  ఆయనకు ఎంతమంది ఓట్లు వేశారు అనేది ముఖ్యం కాదు.  తనకు ఓట్లు వేసినవారికి, వెయ్యనివారికి కూడా ఆయన ముఖ్యమంత్రే.  అలాంటి వ్యక్తిని విమానాశ్రయానికి రావడానికి అనుమతి నిరాకరించడం అంటే అది ఆ జాతి ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమే.  ప్రధాని కార్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టీఆరెస్ పార్టీకి అయాచితవరంగా దొరికింది. తెలంగాణను ప్రధానమంత్రి అవమానించారు అని టీఆరెస్ తన ప్రచారంలో ప్రస్తావించే అవకాశం ఉన్నది.  ప్రజల మనోభావాలను దెబ్బతీసే అనాలోచిత చర్య ఇది.  ముఖ్యమంత్రి స్వాగతం చెప్పినంత మాత్రాన ప్రధానికి కలిగే నష్టం ఏమీ లేదు.  ప్రధాని కార్యాలయం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నదో అనూహ్యం.  
 
టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో నాటి ప్రధానమంత్రి కుమారుడు రాజీవ్ గాంధీ ఎంపీ హోదాలో హైద్రాబాద్ వచ్చినపుడు అంజయ్యకు జరిగిన అవమానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు ఎన్టీఆర్.  ఆంధ్రుల ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా దాన్ని ఎన్టీఆర్ భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు తమకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా తమ ఓట్లను తెలుగుదేశం పార్టీ జోలెలో వెయ్యడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది.  మధ్యలో మర్రి చెన్నారెడ్డి కృషి వలన ఒకసారి, వైఎస్ శ్రమ వలన మరో రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ మహానాయకులు మరణించిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమై పోయిందని టీఆరెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.  మరి ఈనాటి పీ ఎం ఓ కార్యాలయ అవివేకపు నిర్ణయం ఒకటో తారీకు జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు