Prakasam Barrage: కృష్ణమ్మ ఉగ్రరూపం: ప్రకాశం బ్యారేజీకి పొంచి ఉన్న వరద ముప్పు!

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలా మారడంతో, దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రభావంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండగా, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితి : ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఈ తెల్లవారుజాము నాటికి బ్యారేజీకి 3.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు, వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి ఉన్న మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు. ఇందులో 15 గేట్లను రెండు అడుగుల మేర, మిగిలిన 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు పంపుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులుగా ఉంది.

పెరగనున్న వరద ఉధృతి: శ్రీశైలం డ్యామ్ నుండి సుమారు 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయనుండటంతో, రానున్న గంటల్లో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అధికారులు హెచ్చరిక: వరద తీవ్రత దృష్ట్యా కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. నదిలో ప్రయాణించడం, ఈత కొట్టడం, స్నానాలు చేయడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దని ఆయన హెచ్చరించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని తెలిపారు.

తోలు తీస్తా || Analyst Ks Prasad Reacts On CM Chandrababu Strong Warning TO TDP MLAs || TeluguRajyam