ఎట్టకేలకు దుబ్బాకలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత వారం రోజులుగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య రాజకీయం రక్తి కట్టింది. పోలీసుల సోదాలు, నగదు పట్టివేతలు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య దుబ్బాక ఉపఎన్నిక గతంలో జరిగిన ఉపఎన్నికలతో పోల్చితే చాలా హాట్ హాట్ గా సాగుతోంది.
రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక రిజల్ట్ టర్నింగ్ పాయింట్ కావడంతో అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పెద్ద పెద్ద లీడర్లు అంతా దుబ్బాకలోనే మకాం వేయడంతో దుబ్బాక పొలిటికల్ హబ్ గా మారిపోయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియడంతో ఇక పోల్ మేనేజ్ మెంట్ పర్వం మొదలైంది. మంగళవారం పోలింగ్ ఉండడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అంతిమంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది పోల్ మేనేజ్ మెంట్ కావడంతో… ఓటర్లను బూత్ లకు రప్పించి వారితో తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ చివరి అంకంలో ఎవరు రాణిస్తే గెలుపు వారి వశం కానుండడంతో అన్నీ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
పోల్ మేనేజ్ మెంట్ అంటే కేవలం డబ్బులు, మద్యం పంపిణీ మాత్రమే కాదు…. ఓటర్ లిస్టు ఆధారంగా కార్యకర్తల సాయంతో ఓటర్లను మెప్పించి తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం. అయితే ఓటర్లను మెప్పించుకునేందుకు డబ్బు, మద్యం పంపిణీ సర్వసాధారణం అయిపోయిన విషంయ తెలిసిందే. ఈ తరుణంలో అన్ని పార్టీలు ప్రత్యర్థులపై నిఘా వేసి ఉంచాయి. వీరికి తోడు పోలీసులు కూడా నిఘాను పెంచారు. అన్ని గ్రామాల్లో నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబడుతున్నారు.
మరోవైపు ఎన్నికల సంఘం నలుగురు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. మామూలుగా ఒక నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ను నియమిస్తుంది. కాని దుబ్బాకలో నెలకొన్న అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో ఈపాటికే పలు పార్టీలు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో దుబ్బాకకు ఏకంగా నలుగురు నలుగురు స్పెషల్ ఆఫీసర్లను పంపింది ఎన్నికల సంఘం. పోలీస్ అబ్జర్వర్ గా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారిని నియమించింది. ఇక బందోబస్తు కోసం నాలుగు కేంద్ర కంపెనీ బలగాలు ఈపాటికే రంగంలోకి దిగాయి.
రేపు పోలింగ్ 10న కౌంటింగ్
టీఆర్ఎస్ నుంచి దివంగత నేత సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాత, కాంగ్రెస్ నుంచి దివంగత నేచ చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావుతో పాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కత్తి కార్తీక కూడా బరిలో నిలిచింది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 1,98,756 మంది ఓటర్లు ఉండగా… 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 89 కేంద్రాలను సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించారు. చూడాలి మరి ఈనెల 10న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో విజయం ఎవరిని వరిస్తుందో.