ఈరోజుల్లో బ్యాంకు ఖాతా లేనివారైనా ఉన్నారేమో కానీ, సోషల్ మీడియా వేదికలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లాంటి వాటిలో ఖాతా లేనివారు ఉండకపోవచ్చు. ముఖ్యంగా గత పదేళ్లుగా సామాన్య విద్యావంతులే కాక రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియాను ఉధృతంగా వాడుకుంటున్నాయి. రాజకీయపార్టీలకు, పార్టీ ముఖ్య నాయకులకే కాక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరకు సర్పంచ్ నాయకుల అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ నాయకులకు, పార్టీలకు విస్తృతమైన ప్రచారాన్ని కల్పిస్తున్నారు.
మనదేశంలో సోషల్ మీడియాను వాడుకోవడంలో ప్రధాని మోడీ ముందంజలో ఉంటారని చెబుతారు. ఆయన ట్విట్టర్ ఫాలోవెర్స్ సంఖ్య లక్షలు దాటిపోయింది. అలాగే సోషల్ మీడియా వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెండోడో మూడోదో స్థానంలో ఉన్నారట. ఎక్కడో కన్యాకుమారిలో నివసించేవారు కూడా ఢిల్లీలో ఉండే ప్రధానికి ట్వీట్ చేస్తే క్షణంలో చేరవలసినవారికి చేరుతున్నది. తెలంగాణాలో మంత్రి కెటియార్ ట్విట్టర్ వాడకంలో అగ్రస్థానంలో ఉన్నారు.
ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు వచ్చిందంటే పత్రికలు, ఛానెల్స్ అన్నీ తమ తమ అభిమాన పార్టీలకు కొమ్ము కాస్తూ వ్యతిరేక పార్టీలపై బురద చల్లుతూ అపఖ్యాతి చెయ్యడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు, విధానాలు, సంక్షేమ పధకాల వివరాలను ప్రజలకు చేరువ చెయ్యడంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తున్నది. ఒకప్పుడు ఈ సోషల్ మీడియాను వాడుకునేవారిని పనీపాటా లేనివారుగా హేళన చేసేవారు. కానీ, మారుతున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా వినియోగదారులకు “సోషల్ మీడియా వారియర్స్” అంటూ గౌరవంగా పిలుస్తున్నారు.
మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆరెస్ పార్టీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాను సరిగ్గా వాడుకోకపోవడమే అని టీఆరెస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిస్వార్ధంగా పనిచేస్తున్న వారియర్స్ ను పార్టీ నిర్లక్ష్యం చేసిందని, వారిని గుర్తించడంలో తాత్సారం చేసిందని, ఫలితంగా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించలేదని, ఆ ఫలితమే పార్టీ వెనుకంజ అని తమ పోస్టింగ్స్ లో స్పష్టం చేస్తున్నారు.
ఒక ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లి తమ నాయకుడి గొప్పదనాన్ని లబ్దిదారులకు చేరువ చేసి పార్టీ పట్ల అభిమానాన్ని పెంపొందింపజేసేది సోషల్ మీడియా కార్యకర్తలే అన్నది తిరుగులేని వాస్తవం. మరీ ముఖ్యంగా వైసిపి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం, వాత్సల్యం, గోరువంతో పార్టీ అభిమానులు కేసులకు కూడా భయపడకుండా చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద సమరమే చేసారు. వీరంతా తమ సొంత ఖర్చుతో మొబైల్ డేటా కొనుక్కుంటూ తమ ఉద్యోగాలు, వ్యాపారాలను కూడా కొంతమేర త్యాగం చేసి పార్టీకోసం పోరాడిన వారు. కాబట్టి గుర్తింపు కోరుకోవడం అసహజం కాదు.
సోషల్ మీడియాలో అత్యంత చురుకుగా వ్యవహరించే నాయకులలో రాజ్యసభ సభ్యలు విజయసాయి రెడ్డిగారిది అగ్రతాంబూలం. ట్వీటర్లో ఆయన చంద్రబాబు, లోకేష్ లతో చెడుగుడు ఆడుకుంటారు. వారి దుర్విధానాలను, దుర్భుద్ధులను ఎండగడుతుంటారు. సోషల్ మీడియా మహత్యం ఏమిటో తెలుసు కాబట్టే ఇటీవల వరుసగా అయిదారు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలతో తాడేపల్లి, విశాఖపట్నం లలో సుదీర్ఘ సదస్సులను నిర్వహించారు. వైసిపి సోషల్ మీడియా విభాగానికి సర్వంసహాధిపతి అయిన విజయసాయి రెడ్డి గారు ప్రతి సమావేశంలోనూ గంటల తరబడి పాల్గొని పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, వారి వారి అర్హతలను బట్టి వారికి ఉద్యోగకల్పనలు, ఇతర ప్రయోజనాలను చేకూర్చుతామని విస్పష్టమైన హామీని ఇచ్చారు. విశాఖ లోని అనేక కంపెనీలలో రెండువేలవరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, వాటిలో అర్హులకు స్థానాలు కల్పిస్తామని ఊరడించారు. “సోషల్ మీడియా లేకపోతె ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం” అని ప్రకటించి జగన్ అభిమానుల గుండెల్లో పన్నీటి జల్లులు కురిపించారు.
విజయసాయి రెడ్డి ఇచ్చిన హామీతో సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఆనందించారని, ,పార్టీకోసం ఇనుమడించిన ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారని చెప్పుకుంటున్నారు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు