‘తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తాం..’ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఇది సాధారణ రాజకీయ ప్రకటనగానే చాలామందికి కనిపించవచ్చు. అయితే, తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, అధికార టీఆర్‌ఎస్‌కి షాక్ ఇచ్చిన దరిమిలా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నిక విషయమై ఇప్పటినుంచే అప్రమత్తమవ్వాల్సి వుంటుంది. బీజేపీని లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే లైట్ తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. అలాగని, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంత స్ట్రాంగ్‌గా వుందా.? అంటే, వీక్‌గా అయితే లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.
తిరుపతి ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రమిదీ..
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అడ్వాంటేజ్ అధికార వైఎస్సార్సీపీదే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఉప ఎన్నిక ఎప్పుడు.? అన్నదానిపై స్పష్టత లేదు గనుక, అభ్యర్థి విషయమై వైసీపీకి అంత తొందర లేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, తిరుపతి ఉప ఎన్నిక విషయమై ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇంతవరకు ఆ పార్టీ నుంచి ఘాటైన ప్రకటన ఏదీ రాలేదు. అయితే, జనసేన పార్టీ మాత్రం ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో వుంది. ఆ జనసేనకు చెక్ పెడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్టేట్‌మెంట్ ఇచ్చేశారని అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ, జస్ట్ ఆటలో అరటిపండు మాత్రమే.
జనసేన పోటీ చేస్తే పరిస్థితి ఏంటి.?
మెగాస్టార్ చిరంజీవి, చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు.. అదీ ప్రజారాజ్యం పార్టీ అధినేత హోదాలో. అయితే, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రిగా పనిచేశారు. ‘తిరుపతిలో గెలిచి, ఆ తర్వాత రాజీనామా చేసి.. తిరుపతిని వదిలేశారు.. తిరుపతి ప్రజల్ని అవమానపరిచారు..’ అనే విమర్శ చిరంజీవి మీద వున్నా, మెగా కుటుంబానికి వీరాభిమానులు అక్కడ చాలామందే వున్నారు. దాంతో, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా తిరుపతి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తే మంచి ఫలితం వుంటుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
కాక రేపిన వీర్రాజు.. కథ మొదలైనట్లే.!
సోము వీర్రాజు ప్రకటనతో తిరుపతి ఉప ఎన్నికల కాక రేగింది. ఆయా పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. దుబ్బాక ఫలితం తర్వాత, ముందస్తుగా ఎవరైతే పొలిటికల్ హీట్ రగల్చగలరో, వారిదే ఉప ఎన్నికలో గెలుపు.! సో, ఇక నుంచి తిరుపతి ఉప ఎన్నిక చుట్టూ రాష్ట్ర రాజకీయాలు గిర్రున తిగరబోతున్నాయన్నమాట.