Cards Club: పేకాటకు ‘కూటమి’ కళ… 100 కార్లు, 120 మంది రాయుళ్లు, బోర్డుపై లక్షలు!

Cards Club: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జనావాసాల మధ్య, గుడి ముందు, బడి పక్కన బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగాయనే విమర్శలు, వాటికి సాక్ష్యాలు విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పేకాట్ క్లబ్ లు, జాతర్లు, తీర్ధాలలో గుండాటలు హల్ చల్ చేస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో బిగ్ ఇష్యూ తెరపైకి వచ్చింది. దీంతో.. పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఏపీ ప్రజానికం.

తాము అధికారంలోకి వస్తే జగన్ ను మించిన పథకాలు ఇస్తామన్నారు అవి ఇవేనా?

స్వయంగా పవన్ కల్యాణే పేకాట క్లబ్బుల గురించి మాట్లాడిన తర్వాత అయినా ఈ విషయంలో మార్పు రావడం లేదా?

ప్రభుత్వం అటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇటు జనసేన ఎమ్మెల్యేలుగా విడిపోయిందా.. వీరి మధ్య ఏమి చేయాలో పోలీసులకు అర్ధం కావడం లేదా?

ప్రతీ రోజూ వంద మందికి పైగా జనం ఒక చోట చేరి పేకాట ఆడుతూ, లక్షలు బోర్డులపై పెడుతున్నారంటే.. దీన్ని ఎవరి నిర్లక్ష్యంగా, మరెవరి చేతకానితనంగా చూడాలి?

ఏ పండక్కో పబ్బానికో ప్రజల కోరిక మేరకో, ఆనవాతీ ప్రకారమో ఒకటి రెండు రోజులు అనుమతి ఇచ్చారంటే ఏమోలే అనుకోవచ్చు కానీ.. ఇదేమిటిది?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుందని.. బెల్టు షాపులు ఇష్టారాజ్యంగా వెలిశాని.. ఇక పేకాట రాయుళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఈ విషయంపై ఇటీవల ఫైరయ్యారు. అయితే.. అది పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా పేకాట క్లబ్బుల రూపంలో బయటకొచ్చిన విషయం అని అప్పట్లో కథనాలొచ్చాయి.

ఈ సందర్భంగా స్థానిక పోలీసు ఉన్నతాధికారులపైనా విమర్శలు గుప్పించారు! ఈ నేపథ్యంలో ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు సదరు పోలీసు అధికారిని వెనకేసుకొచ్చారనే చర్చా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఏలూరు జిల్లా నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా సాగుతోన్న పేకాట క్లబ్బులపై డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో.. కృష్ణా, గుంటూరు జిల్లాల‌తో పాటు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వ‌చ్చి ఆడుతున్నట్టు బ‌య‌ట‌ప‌డింది.

ఈ సంద‌ర్భంగా సుమారు 120 మందికి పైగా పేకాట‌రాయుళ్లను గుర్తించిన పోలీసులు.. వారి నుంచి రూ.18 ల‌క్షల న‌గ‌దు, 100కు పైగా కార్లు, పలు ద్విచ‌క్ర వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ స్థాయిలో జూదం జరుగుతుందని.. పెద్ద పెద్ద హాళ్లు, టెబుల్స్, చైర్స్ , కరెంట్ మెయింటినెన్స్, పార్కింగ్ ఫెసిలిటీ వెరసి.. ఇక్కడొక పెద్ద వ్యవహారమే నడుస్తుందని.. ఇలా వదిలేస్తే ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలే నడిచినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు.

కాగా… ఈ పేకాట యదేచ్ఛగా జరుగుతుందని చెబుతున్న ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గానికి మంత్రి కొలుసు పార్ధసారథి ప్రాత్నిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగిరిపల్లి మండలంలోని పోతవరప్పాడు శివారులోని మ్యాంగొ రిక్రియేషన్ క్లబ్ లో కొన్ని నెలలుగా యథేచ్ఛగా జూదం నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా… ఇంత జరుగుతున్నా జవాబుదారీతనం లేని పాలన కచ్చితంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని అంటున్నారు పరిశీలకులు.

జగన్ పై పవన్ పైత్యం || Analyst Chinta Rajasekhar About Pawan Kalyan Comments On Ys Jagan || TR