ప్రధాని నరేంద్ర మోదీ ప్రసిద్ధి గాంచిన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మహిళలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడంలో సంగారెడ్డి మహిళలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. ముఖ్యంగా డ్రోన్ సాంకేతికతను అత్యుత్తమంగా వినియోగిస్తున్న జిల్లాగా సంగారెడ్డిని ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వ్యవసాయ డ్రోన్ల వినియోగాన్ని సంగారెడ్డి మహిళలు పెద్ద సంఖ్యలో స్వీకరించడం విశేషమని ఆయన కొనియాడారు. పురుగుల మందుల పిచికారీ, ఫలితాల విశ్లేషణ వంటి వ్యవసాయ కార్యకలాపాల్లో ఈ డ్రోన్ల వాడకం గణనీయమైన మార్పును తీసుకొచ్చిందని మోదీ తెలిపారు. దేశంలో మొదటిసారిగా మహిళల ఆధిక్యంతో డ్రోన్ల వినియోగం జరుగుతున్న జిల్లా సంగారెడిగా గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు.
ఇక ఈ సందర్భంగా ప్రధాని మోదీ “ఆపరేషన్ సిందూర్” అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదంపై దేశం తీసుకున్న కఠినమైన వైఖరి ద్వారా జనాల్లో భద్రతపై విశ్వాసం పెరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జన్మించిన చిన్నారులకు “సిందూర్” అనే పేరు పెట్టడం దేశభక్తికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. “ఇది కేవలం సైనిక చర్య కాదు, ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి ప్రతిబింబం” అని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణలోని మహిళా రైతుల వినూత్న ప్రయోగాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర ప్రభుత్వ నూతన ఆవిష్కరణలకు, రాష్ట్రాల స్థాయి స్థాయిలో మహిళలు ఈ రీతిలో ముందుకు రావడం గర్వించదగిన అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన్ కీ బాత్ వేదికగా మోదీ చేసిన ఈ ప్రశంసలు తెలంగాణ మహిళలకు మరింత ప్రోత్సాహం కలిగించనున్నాయి.