రామ్ లీలా మైదానంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వేదికపై ఉన్న ఎన్డీఏ మిత్రపక్ష నాయకులను అభివాదం చేస్తూ వెళ్లిన మోదీ, పవన్ వద్దకు రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే, మోదీ ముఖంలో కనిపించిన చిరునవ్వు, పవన్ తో జరిగిన ఆ క్షణిక సంభాషణలో హిమాలయాల ప్రస్తావన రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.
మోదీ, పవన్ ను చూస్తూనే నవ్వుతూ, “ఏంటి, అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారా?” అని సరదాగా ప్రశ్నించారట. దీనికి పవన్ కూడా చమత్కారంగా స్పందిస్తూ, “ఇంకా అలాంటి ఆలోచన లేదు, ముందు ఇవన్నీ చూసుకోవాలి” అని జవాబిచ్చినట్లు తెలిపారు. ఈ మాటల మధ్యలో ఇద్దరూ నవ్వుకున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://x.com/HumanTsunaME/status/1892476988301930718?t=VqovM2lPUMUPXuYFLkW2_w&s=19
ఈ సందర్భంలో బీజేపీ ఢిల్లీలో సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ పవన్, “ఇది మోదీ నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానం. ఇలాంటి చరిత్రాత్మక విజయం మళ్లీ మళ్లీ రావడం సాధ్యం కాదు. దేశమంతా మోదీపై ఉన్న విశ్వాసాన్ని ఈ ఫలితం ప్రతిబింబిస్తుంది” అని వ్యాఖ్యానించారు. పవన్ మాటలు ఆయన రాజకీయ స్థిరతపైనే కాక, కేంద్ర రాజకీయాల్లో ఆయనకున్న ప్రాధాన్యతను కూడా చూపిస్తున్నాయి.
సాధారణంగా రాజకీయ సమావేశాల్లో ఇలాంటి అనధికారిక సంభాషణలు పెద్దగా బయటకు రావు. కానీ, హిమాలయాల ప్రస్తావనతో మోదీ, పవన్ మధ్య చర్చకు అందరి దృష్టి వెళ్లింది. ఇది కేవలం సరదా సంభాషణ మాత్రమేనా? లేక భవిష్యత్తులో ఏదైనా సంకేతమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తంగా, ఈ హిమాలయాల ముచ్చట రాజకీయ వర్గాల్లో కొత్త వాదనలకు వేదికయింది.