హిందూధర్మం పాటించేవారు ప్రతి సంవత్సరం పితృ పక్షం (Pitru Paksha) ప్రారంభమైతే.. పూర్వీకులను స్మరించుకునే ఆ పవిత్ర వాతావరణం ఇంటింటా నెలకొంటుంది. ఈసారి 2025లో పితృ పక్షం సెప్టెంబర్ 7న మొదలై, సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతోంది. ఈ కాలంలో చనిపోయినపెద్దలు, తల్లిదండ్రులు, వంశ పితామహుల ఆత్మ శాంతి కోసం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుంటారు. అందులో కాకులకు (Crows) ఆహారం పెట్టడం ఒక ప్రధానమైన ఆచారం. ఎందుకంటే హిందూ సంప్రదాయం ప్రకారం, కాకులను పితృదేవతల దూతలుగా భావిస్తారు. కానీ నేటి పరిస్థితుల్లో కాకులు అంత సులభంగా కనిపించడం లేదు. మరి కాకులు లేకపోతే పితృ కర్మలను ఎలా పూర్తి చేయాలి.. అనే ప్రశ్న చాలామందికి వస్తోంది.
శాస్త్రాల ప్రకారం, కాకులు అందుబాటులో లేని సందర్భంలో ఇతర జీవులకు ఆహారం పెట్టడం ద్వారా కూడా ఈ కర్మ ఫలితం లభిస్తుంది. గోవుకు ఆహారం పెట్టడం అత్యంత శ్రేష్ఠమైన మార్గంగా భావించబడింది. గోవు పవిత్రతకు ప్రతీక కావడంతో, దానికి నైవేద్యం పెట్టడం పితృదేవతలకు నేరుగా తృప్తి కలిగిస్తుందని నమ్మకం. అదే విధంగా కుక్కలకు ఆహారం పెట్టడమూ మంచి ఫలితాలనే ఇస్తుంది. కుక్కలు విశ్వాసానికి, రక్షణకు ప్రతీకగా పరిగణించబడతాయి కాబట్టి వాటికి ఇచ్చే ఆహారం కూడా పితృదేవతలకు చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఒకవేళ ఆవు, కుక్క కూడా అందుబాటులో లేకపోతే, చీమలు లేదా ఇతర చిన్న జీవులకు కూడా ఆహారం పెట్టడం మంచిదే. ముఖ్యంగా ఈ కర్మ ఉద్దేశం అన్నివర్గాల జీవులను తృప్తి పరచడమే. ఇంకా ఒక శక్తివంతమైన మార్గం బ్రాహ్మణులను భోజనానికి పిలిచి, వారికి దక్షిణ ఇవ్వడం. పండితులకు గౌరవంగా భోజనం పెట్టి, గౌరవిస్తే పూర్వీకులు సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు.
ఇక ఈ శ్రాద్ధ కర్మల చేసే సమయంలో సాత్విక ఆహారం సిద్ధం తినడం చాలా ముఖ్యం. ఉల్లి, వెల్లుల్లి, ఘాటైన మసాలాలు లేకుండా నెయ్యి అన్నం, పెసరపప్పు, కిచిడీ, హల్వా వంటి వంటకాలను సిద్ధం చేసి, మధ్యాహ్నం (అపరాహణ కాలం)లో ఈ క్రతువును చేయడం అత్యంత శుభప్రదం. అంతేకాదు, పేదవారికి ఆహారం పెట్టడం, ధాన్యం లేదా బట్టలు దానం చేయడం ద్వారా కూడా పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
కాబట్టి పితృ పక్షంలో పూర్వీకులను స్మరించడమే కాకుండా, ప్రకృతిని కాపాడే ప్రయత్నాలు చేయడం కూడా మనందరి కర్తవ్యమని పండితులు సూచిస్తున్నారు. మొక్కలు నాటడం, పక్షులకు నీళ్లు, గింజలు పెట్టడం వంటి పనులు కూడా పితృదేవతలను సంతోషపరిచే పుణ్యకార్యాలుగా పరిగణించవచ్చు. 2025 సెప్టెంబర్ 21న వచ్చే సర్వ పితృ అమావాస్య ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన రోజు. ఈ రోజున వంశంలోని అందరి పూర్వీకుల కోసం శ్రాద్ధ కర్మలు చేస్తే, వారిని స్మరించి, వారి ఆశీస్సులను పొందే అవకాశం లభిస్తుంది. కాకులు అందుబాటులో లేకపోయినా, శ్రద్ధా భక్తులు ఉంటే, పితృదేవతలు తప్పకుండా సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
