PPP Model: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పీపీపీ చుట్టునే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటైజేషన్ చేయడం కూటమి ప్రభుత్వానికి ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది. మరోవైపు.. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి వైఎస్ జగన్ సామ దాన భేద దండోపాయాలు అన్నీ వాడేస్తున్నారు! ఈ క్రమంలో తెరపైకి “సిట్” ప్రస్థావన తేవడంతో విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే కోటి మందికిపైగా ప్రజానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ అస్త్రాన్ని బలంగా వ్యతిరేకించినా.. ప్రభుత్వం వెనక్కి తగ్గదా..?
ప్రభుత్వ సంగతి పక్కనపెడితే… జగన్ వ్యాఖ్యలకో ఏమో కానీ… తొలి విడతలో నాలుగు కాలేజీలకు టెండర్లు పిలవగా.. ఒక్క సంస్థా రాకపోవడంపై అయినా కూటమి ప్రభుత్వం పునరాలోచించడం లేదా..?
పోనీ జగన్ బెదిరింపులు, హెచ్చరికల వల్లే పీపీపీలకు ఏ సంస్థా ముందూ రావడం లేదని అనుకుంటే… మరి తాజాగా జగన్ ఏకంగా “సిట్” ప్రస్థావన తెచ్చారు.. ఈ సమయంలో కూటమికి ఇంకా ఆశలు ఉన్నాయని అనుకోవాలా..?
జగన్ జైలు హెచ్చరికలో, సిట్ బెదిరింపులో.. ఈ నేపథ్యంలో ఇక ఏపీలో పీపీపీ ఉండదు.. ఈ విషయంపై ప్రభుత్వం ఎవరినైనా సంప్రదిస్తే.. వారు డుమ్మా కొట్టడమే మిగిలి ఉందా అనే చర్చలో నిజం లేదా..?
ఆంధ్రప్రదేశ్ లో తమ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడాన్ని అడ్డుకోనే విషయంలో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంత వరకూ వెల్లడానికైనా సిద్ధం అన్నట్లుగా జగన్ దూకుడు ఉందని అంటున్నారు. ఇందుకు ఏమాత్రం తగ్గకుండా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తామని కూటమి సర్కార్ స్పష్టం చేస్తోంది.
దీంతో.. ఏపీ రాజకీయ మరింత రసవత్తరంగా మారింది. ఈ సమయంలో ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి, తమ అభిప్రాయాన్ని చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… జగన్ నుంచి స్ట్రాంగ్ హెచ్చరికలు వచ్చాయి. తాము అధికారలోకి రాగానే పీపీపీలో దక్కించుకున్న కాలేజీలను తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.
ఈ క్రమంలో… పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న కూటమి సర్కార్ ప్రయత్నానికి ఆదిలోనే అడ్డు తగిలింది. ఇందులో భాగంగా… ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె మెడికల్ కళాశాలలకు పీపీపీ విధానంలో టెండర్లు ఆహ్వానించగా.. ఒక్క సంస్థ కూడా బిడ్ వేయడానికి ముందుకు రాలేదు. దీంతో టెండర్లు రాకపోవడానికి జగన్ భయమే కారణమనే ప్రచారం ఓ వర్గం మీడియా విస్తృతంగా చేస్తోంది.
ఈ నేపథ్యంలో అది చాలదన్నట్లుగా మరో షాకింగ్ అప్ డేట్ వైసీపీ నుంచి వచ్చింది.. ఈ విషయంలో తగ్గేదేలే అని చెప్పకనే చెప్పింది! ఇందులో భాగంగా… జగన్ పెట్టిన భయానికి మాజీ మంత్రి పేర్ని నాని మరింత జత చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన… 2029లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై “సిట్” వేస్తామని హెచ్చరించారు. దీంతో… ఇక పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం అటకెక్కినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!



