“సింగన్న అద్దంకి వెళ్లనూ వెళ్ళాడూ రానూ వచ్చాడూ” అని తెలుగు సామెత. అంటే ఆ సింగన్న అద్దంకి అనే ఊరు ఎందుకు వెళ్ళాడో మళ్ళీ ఎందుకు వెనక్కు వచ్చాడో అతనికే తెలియదన్న మాట. మొన్నటి జనసేనాధిపతి ఢిల్లీ పర్యటన ఆ సామెతను తలపించింది. అసలు పవన్ కళ్యాణ్ ను ఢిల్లీ రమ్మని ఎవరు పిలిచారు? అక్కడ ఆయన్ను ఎవరు కలిశారు? ఏమి మాట్లాడారు? ఎందుకు వెళ్ళినల్టు?
బీజేపీ అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకే ఢిల్లీ వెళ్ళమని పవన్ కళ్యాణ్ మేకపోతు గాంభీర్యంతో ప్రకటించినా, పిలిపించుకుని వెళ్లినవాడు నడ్డా దర్శనం కోసం ముప్ఫయి గంటలు వెయిట్ చేయడం దేనికి అంటూ నిలదీస్తున్నారు జనసేన అభిమానులు. నిజంగా పవన్ ను రమ్మని పిలిస్తే విమానం దిగిన వెంటనే నడ్డా ఎదురేగి స్వగతం చెప్పి పవన్ కళ్యాణ్ తో చర్చించాలి కదా? ముప్ఫయి గంటలు పడిగాపులు కాసిన తరువాత ఒక గంటసేపు మొక్కుబడిగా మాట్లాడటం చూస్తుంటే అక్కడ పవన్ కళ్యాణ్ కు తీవ్ర పరాభవం ఎదురైందని వేరే చెప్పాలా? పైగా నడ్డా రమ్మని ఆహ్వానించారని పవన్ కళ్యాణ్ చెప్పడమే తప్ప పవన్ కళ్యాణ్ ను నేను ఆహ్వానించాను అని నడ్డా ఎప్పుడూ చెప్పలేదు.
అంతేకాదు…ఒక మిత్రపక్షం అధ్యక్షుడు, సినిమా గ్లామర్ కలిగిన, కోట్లాదిమంది అభిమానులు కలిగిన పవన్ కళ్యాణ్ అంతటివాడు వస్తే కనీసం అమిత్ షా అయినా మర్యాదపూర్వకంగా అయినా పలకరించవద్దా? పోనీ ఒక కేంద్రమంత్రి ఎవరైనా పలకరించారా? ఏ అధికారిక పదవీ లేని నడ్డాను కలిసి మేము అమరావతి గూర్చి చర్చించాము…పోలవరం నిధుల గూర్చి మాట్లాడుకున్నాము అని సొరకాయ కోతలు కొస్తే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా నమ్ముతాడా? “ఇక్కడ కొందరు సీనియర్ నాయకులను కలిసాము” అని పవన్ చెప్పారు. ఎవరా సీనియర్ నాయకులు? ఒకరిద్దరి పేర్లు చెప్పగలరా పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నది.
అయినా పోలవరం, రాజధాని లాంటి అంశాలు ప్రభుత్వాల స్థాయిలో ప్రధాని, హోమ్ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగాల్సినవి తప్ప అసెంబ్లీలో ఒక్క సీటు కూడా (రికార్డుల ప్రకారం ఒకటి ఉంది లెండి) లేని జనసేన, బీజేపీ అధ్యక్షుల మధ్య జరిగాయి అంటే నమ్మడానికి ఇక్కడ వెర్రివాళ్ళు ఎవరున్నారు? వీరు ఏమి చర్చించగలరు? ఏమి నిర్ణయించగలరు నవ్వులాట కాకపొతే! పవన్ తో మేము పోలవరాన్ని గూర్చి, రాజధానిని గూర్చి చర్చించామని జెపి నడ్డా కానీ, మరెవరైనా బీజేపీ నాయకులుగానీ ప్రకటించిన ఒక్క ఆధారం ఉన్నదా? అన్ని విషయాలను పవన్ చెప్పడమే తప్ప ఢిల్లీలో బీజేపీ నాయకుడు ఒక్కడూ చెప్పలేదు. దీన్నిబట్టే తెలిసిపోతుంది ఢిల్లీలో పవన్ ఏమి రాచకార్యాలను వెలగబెట్టాడో!
ఒకపక్క హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని ప్రకటించి పవన్ పరువు తీసేసాడు బండి సంజయ్. తిరుపతిలో మా పార్టీ అభ్యర్థి నిలబడతాడు అని ప్రకటించి సోము వీర్రాజు పవన్ మర్యాద మంటగలిపాడు. ఏ రకంగా చూసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఆంధ్రా, తెలంగాణ, కేంద్ర స్థాయిలో సత్తు పావలా విలువ కూడా లేదని ఇప్పటికే అనేకమార్లు స్పష్టం అయ్యాక కూడా ప్రజలను మభ్యపెడుతూ పవన్ కళ్యాణ్ ఎందుకు బిల్డప్పులు ఇస్తున్నారో అర్ధం కావడం లేదు.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి సాధించింది ఏమీ లేదని, అసలు ఆయన పర్యటన శుద్ధ వ్యర్థమని, నడ్డాతో మాట్లాడాలంటే ఇవాళో రేపో ఆయన హైదరాబాద్ వస్తున్నారని, ఇక్కడే కలిస్తే పోయేది కదా అని జనసైనికులు బాధపడుతున్నారని సమాచారం. “మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడికోడలు నవ్వినందుకు అని సామెత చెప్పినట్లు పవన్ సాధించింది ఏమీ లేకపోయినా ప్రత్యర్ధులు, సోషల్ మీడియాలో పడుతున్న చెణుకులు, వ్యంగ్యాస్త్రాలకు జవాబు చెప్పుకోలేక కుమిలిపోతున్నారట జనసేన కార్యకర్తలు! కౌంటర్లు ఇవ్వాలని ఉన్నా, ఇవ్వడానికి ఏమీ లేకపోవడం వారికి పుండు మీద కారం చల్లినట్లుగా ఉందట!
మొత్తానికి రాజకీయ పార్టీ ని నడపడంలో, వ్యూహాలు రచించడంలో పవన్ కళ్యాణ్ నూటికి రెండు వందల పాళ్ళు విఫలం అయ్యారని, ఆయనకు సరైన నిర్ణయాలు తీసుకోవడం చేతకాదని, చిరంజీవిని మించి అపహాస్యం పాలయ్యారని, మరో కొద్ది నెలల్లో జనసేన దుకాణం షట్టర్ వేసుకోవడం ఖాయం అని జనసేన గ్రామస్థాయి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు