ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా…బుల్లెట్ దిగిందా?…లేదా?…ఇది పోకిరి సినిమాలో హీరో మహేష్ వాడిన డైలాగ్…ఇది ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు….ఇప్పుడు ఇదే డైలాగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వల్లెవేస్తున్నారు. కారణం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక ప్రధాన సంఘటనపై అందుకు బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే తమ నాయకుడు రంగంలోకి దిగి ప్రభుత్వం కొమ్ములు వంచాడని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మిగిలిన ఎవరి వల్లా సాధ్యం కానిది తమ నాయకుడు నడుంబిగించి కార్యాచరణ ప్రారంభించడంతోనే ప్రభుత్వం దిగివచ్చిందని వారు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. అది కూడా తమ నాయకుడు కొత్త పంథాలో ఆరంభించిన మొదటిపని ఇదని, దీన్ని ఆయన దిగ్విజయంగా పూర్తిచేసి ఆ రూట్ లో తొలి విజయంతో బోణీ కొట్టారని వారు సంబరపడుతున్నారు.
అందరికంటే ముందడుగు
అంతర్వేది రథం దగ్థం ఘటనపై హిందూత్వ మద్దతుదారులతో పాటు ప్రధాన ప్రతిపక్షం టిడిపి, విపక్షాలు బిజెపి, జనసేన,కాంగ్రెస్ ఇలా అందరూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. దీనికి సమాధానంగా వైసిపి ప్రభుత్వం జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామనే తప్ప పరిస్థితి తగినంత వేగంగా స్పందించలేదు. ఒకవైపు ఈ ఘటనపై ప్రభుత్వాన్న ఘాటైన విమర్శలతో దుయ్యబడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మిగిలిన అందరి కంటే మరో అడుగు ముందుకేసి బిజెపితో కలసి నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఆయన అలా పిలుపునిచ్చిన 24 గంటలలోపే ప్రభుత్వం అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం వల్లే ప్రభుత్వం దిగి వచ్చి ఈ నిర్ణయం తీసుకొందని జన సైనికులు సోషల్ మీడియాలో పోస్ట్ ల మీద పోస్టులు పెడుతూ పండుగ చేసుకుంటున్నారు.
ఆ రూట్ లో ఇది తొలి విజయమా?
గతంలో లౌకిక వాదిగా మిగిలిన రాజకీయ నేతల కంటే ఎక్కువగా ముస్లింలు,క్రైస్తవులతో మమేకమైన పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న తరువాత రూట్ మార్చేశారు. వారి భావజాల ప్రభావమో లేక సరికొత్త వ్యూహమో…తొలుత ఆహార్యంలో…ఆ తరువాత భావ ప్రకటనల్లోనూ మార్పులు కనబర్చిన పవన్ చివరకు సైద్దాంతికంగాను పూర్తిగా మారి కొత్త పంథాలో వెళ్లేందుకు సంసిద్దమైనట్లు అర్థమవుతోంది. అలా తాను వెళ్లాలనుకుంటున్న రూట్ పూర్తి స్థాయి హిందూత్వ వాదిగా రూపాంతరం చెందడమనేదే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ మార్గంలో మొదటి అడుగుగా అంతర్వేదితో ఆరంగ్రేటం చేసినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయమై తాను నిరసనకు పిలుపుఇచ్చిన తరువాతే ప్రభుత్వం సిబిఐ విచారణ అంటూ దిగి రావడంతో అది తన విజయంగా ఆయన ఖాతాలో వేసుకోవడం సహజమేనంటున్నారు.
ఫలితం ఎలా ఉండొచ్చు…
అయితే విభిన్న వర్గాల్లో అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి హిందూత్వ నేతగా మారితే లౌకిక వాద గట్టు నుంచి…హిందూత్వ వాద గట్టు మీదకు వచ్చినట్టేనని…ఇక ప్రతి విషయంలోనూ ఆయన స్పందించే ముందు హిందూత్వ వాదుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని….మరి అలా చేస్తే మిగిలిన వర్గాల్లోని ఆయన అభిమానులు నొచ్చుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. దాని వల్ల రాజకీయంగానే కాదు సినీ కెరీర్ పరంగాను ఇబ్బందులు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. అయినప్పటికి వాటిని తోసిరాజని పవన్ అదే రూట్ లో ముందుకు వెళ్లడం అంత సులువేమీ కాదంటున్నారు. ఈ కొత్త మార్గంలోనైనా పవన్ తాననుకున్న లక్ష్యాన్ని సాధిస్తారేమో వేచిచూడాలి.