పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఏమంత సాఫీగా సాగడంలేదు. అడుగడుగునా ఆటుపోట్లు, ప్రతి మలుపులోనూ పోటీ, ఆశించిన చోటల్లా పరాజయం. ఇవి ఇన్నేళ్ల పొలిటికల్ జర్నీలో పవన్‌కు దక్కిన ఫలితాలు. వెరొకరైతే ఈ రిజల్ట్స్ చూసి జెండా ఎత్తేసేవారే. కానీ పవన్‌లో రాజకీయాల పట్ల బలమైన కమిట్మెంట్, గెలుపోటములకు అతీతమైన వ్యక్తిత్వం ఉన్నాయి కాబట్టి తట్టుకుని నిలబడగలుగుతున్నారు. నిలబడ్డ చోటే తేల్చుకోవాలనే మొండితనం ఉంది కాబట్టి అందరూ కార్నర్ చేసినా బేఫికర్ అంటూ ముందుకుపోతున్నారు. ఇవన్నీ మంచి లక్షణాలే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉండాల్సిన గుణాలే. వీటితో పాటే వ్యూహరచన, రాజకీయ చతురత కూడా అవసరం. ఒక లీడర్ ఏదైనా వ్యూహం పన్నితే అది అప్పటికప్పుడు బయటపడదు. మెల్లగా తన పని పూర్తిచేసి ఫలితాలతో ప్రత్యర్థులను కంగారుపెట్టి, జనాన్ని ఔరా.. ఏం వ్యూహం వేశాడు అనుకునేలా చేస్తుంది. పరిస్థితులకు తగ్గట్టు రాజకీయం చేస్తే అనుకున్న లక్ష్యానికి మార్గాలు తెరుచుకుంటాయి. మరి పవన్ ఈ వ్యూహరచన చేస్తున్నారా, చతురతతో కూడిన రాజకీయం చేస్తున్నారా అనేది బయటపడాల్సి ఉంది.
ఇప్పటివరకూ గొప్ప కదలిక లేదు
ఎన్నికలు ముగిసి ఏడాది గడిచిపోయింది. దారుణమైన ఫలితాల తర్వాత నిరాశలో ఉన్న శ్రేణులను ఉత్సాహపరిచేలా రానున్న ఐదేళ్ళలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, కొత్త నాయకులను తయారుచేసుకోవడం, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపడం, అవసరమైతే పోరాటాలు సైతం నడుపుదాం అంటూ పవన్ మాట్లాడారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ సంపూర్ణంగా జరుగుతున్న దాఖలాలైతే కనబడట్లేదు. పభుత్వం చేసే పొరపాట్లను వదిలిపెట్టం అన్నారు. కానీ సర్కార్ తప్పిదాలను గుర్తించడం వరకే పరిమితమయ్యారు. ఇసుక కొరత, మద్యం ధరల పెంపు, తెలుగు మీడియం రద్దు, రాజధానిగా అమరావతిని కాదనడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మి సంక్షేమం చేస్తామనడం, భూములిచ్చిన రైతులకు కౌలు అలస్యంగా చెల్లించడం, కరోనా నియంత్రణలో లోపాలు వంటి వాటిని ఎత్తి చూపడం, ప్రెస్ నోట్ ద్వారా ఖండించడం అయితే చేస్తున్నారు కానీ ఎక్కడా ప్రజలు నాలుగు రోజులు మాట్లాడుకునేలా పోరాటం లేదు.
ఇక అన్నిటికంటే ప్రధానమైనది పార్టీని బలపర్చుకోవడం. ఎన్నికలు ముగిశాక ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి వలసలు కామన్. చాలామంది నేతలు అధికార పార్టీ వైపే చూసినా కొందరైనా ఇతర పార్టీలను ప్రత్యామ్నాయంగా చూస్తారు. కానీ ఇక్కడ ఏ నాయకుడూ జనసేనను ఆల్టర్నేట్ అనుకోవడం లేదు. పార్టీలోకి కొత్తగా కార్యకర్తల చేరిక హడావుడి లేదు. క్రితంసారి జనసేన టికెట్ మీద పోటీచేసిన వారిలో కొందరు బాగా పనిచేస్తున్నా ఇంకొందరు మాత్రం కనుమరుగైపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో అసలు పార్టీ ఊసే వినిపించట్లేదు. ఇక లోక్ సభ సెగ్మెంట్ల స్థాయిలో సన్నద్దత గురించి మాట్లాడుకోనక్కర్లేదు. జనసైనికులు ఎప్పటిలాగే సేవా కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేస్తున్నా రాజకీయంగా ప్రజల్లోకి వెళ్లే ప్లాన్ ఏదీ వారి దగ్గర లేదు. ఈ డ్రాబ్యాక్స్ అన్నిటికీ రీజన్ పవన్ నెమ్మదితనం. పవన్ చేద్దాం, చూద్దాం అన్నట్టు ఉండటంతో గొప్ప కదలిక లేదు. ఈ యేడాదిలో బీజేపీతో పొత్తు పెట్టుకునే నిర్ణయం తప్ప పవన్ రాజకీయపరంగా వేసిన ముందడుగు ఏదీ లేదు.
సినిమాలతో సాధ్యమయ్యే పనేనా పవన్ ?
తాజాగా వినిపిస్తున్న వార్తల మేరకు పవన్ సినిమాల ద్వారా 2024 ఎన్నికలకు ఒక దారి ఏర్పరచుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇక సినిమాలు చేసే టైమ్ లేదన్న పవన్ ఆతర్వాత నిర్ణయం మార్చుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. దీన్ని కొందరు తప్పుబట్టినా సినిమాలు తప్ప ఆయనకు ఇంకో ఆదాయ మార్గం లేదు కాబట్టి మళ్లీ సినిమాలు చేయడంలో తప్పేమీ లేదు. పార్టీని నడపడానికి, కుటుంబ పోషణకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది కాబట్టి సినిమాల్లో నటించి సంపాదించుకోవచ్చు.
అయితే సినిమాల ద్వారానే ఆయన జనాన్ని తన వైపుకు తిప్పుకోవాలని, రాజకీయంగా బలపడాలని చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే ‘వకీల్ సాబ్’ నుండి క్రిష్ డైరెక్షన్లో చేయబోయే చిత్రం, ఆ తర్వాత హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డిల చిత్రాల వరకు అన్నీ సామాజిక కోణంలో ఉండే కథలనే ఎంచుకున్నారట. వీటితో ఓటు బ్యాంక్ సంపాదించాలన్నది పవన్ కళ్యాణ్ ప్లాన్ అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే అది వృథా ప్రయాసే అవుతుంది. ఎందుకంటే సినిమాలతో జనాన్ని థియేటర్లకు రప్పించవచ్చు కానీ ఓటింగ్ బూత్ లో ఓటు వేయించుకోలేరు. హాల్లో ఉర్రూతలూగించి కేకలు పెట్టించవచ్చు కానీ పార్టీ జెండాను భుజానికెత్తుకునేలా చేయలేరు. అసలు సినిమా స్టార్లకు రాజకీయ రంగంలో చక్రం తిప్పే అవకాశం ఓటర్లు ఇవ్వడంలేదు. ఆ కాలం నందమూరి తారక రామారావుగారితోనే ముగిసిపోయింది.
అందుకు సాక్ష్యాలు పవన్ కళ్యాణ్ కుటుంబంలోనే ఉన్నాయి. అవి ఒకటి ప్రజారాజ్యం పెట్టి దెబ్బతిన్న చిరంజీవి రెండు స్వయంగా పవన్ కళ్యాణే. వెండితెర చరీష్మా రాజకీయరంగంలో ఎక్కువ దూరం తీసుకెళ్ళలేదని గత ఎన్నికల ఫలితాల్లోనే సేనానికి అర్థమై ఉండాలి. సినిమాలు ఆయన్ను జనానికి దగ్గర చేస్తాయి కానీ జనసేన పార్టీని కాదు. ఆల్రెడీ పవన్ ప్రజలకు ఎంత దగ్గరవ్వాలో అంతా అయ్యారు. చేయాల్సిందల్లా పార్టీని దగ్గర చేయడం.
ఎవరినైనా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగితే ఆయనకేం మంచివాడు, సేవ చేస్తాడు అంటూ గొప్పగా చెబుతారు. జనసేనకు ఓటేస్తారా అనడిగితే అలోచనలో పడతారు. అదే వ్యక్తికి పార్టీకి ఉన్న తేడా. దాన్ని గమనించుకుని పవన్ సినిమాలను ఆదాయ మార్గంగా మాత్రమే చూస్తూ పార్టీని జనంలోకి తీసుకెళ్లే రాజకీయపరమైన పనులేమైనా చేస్తే ప్రయోజనం ఉంటుంది కానీ సినిమాలతోనే రాజకీయ బాటలు వేసుకోవచ్చు, బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టి సీఎం పదవి అందుకోవచ్చు అనుకుంటే మాత్రం సమయం వృథా చేసినట్టే.