పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…హీరో గా యూత్ లో బాగా క్రేజ్ ఉన్న ఓ సినిమా స్టార్…ఆ తర్వాత రాజకీయ రంగంలో ఆరంగ్రేటం…తొలుత అన్న పెట్టిన పార్టీకి సహకారం…ఆ తరువాత తానే సొంత పార్టీ పెట్టి దానికి అధ్యక్షుడిగా మారిన వైనం. అయితే అటు సినిమాల్లో కానీ…ఇటు రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ ది విభిన్న శైలి. అదే ఆయనకు అనేక సార్లు ప్లస్ గా…చాలా మైనస్ గా మారుతుండటం మరో విచిత్రం. ఇక సినిమా హిట్-ఫ్లాప్ లతో సంబంధం లేకుండా యూత్ లో విపరీతమైన క్రేజ్ కలిగివుండి అక్కడ అగ్ర స్థానంలో కొనసాగుతున్న పవన్ మరోవైపు రాజకీయాల్లో పార్టీ అధినేతగా మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తన పార్టీ తొలి లక్ష్యంగా చేసుకున్న ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేతగా ఆయన ప్రభావం స్థాయి ఏ మేరకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. అందుకు కారణం అనూహ్యమైన ఆయన రాజకీయ నిర్ణయాలే అనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అలాంటి పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఆయన రాజకీయంగా ఇప్పుడు మరో విభిన్నమైన మార్గం ఎంచుకున్నారా?…అనే చర్చలు జోరందుకున్నాయి.
ఇకపై పూర్తి స్థాయి హిందూ నేతగా పవన్
సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా…సొంత ఇమేజ్ ను జీరో స్థాయి నుంచి నుంచి సూపర్ హీరో స్థాయి వరకు పవన్ కళ్యాణ్ క్రమంగా పెంచుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం ఇప్పటివరకు తాను కోరుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయారు. ఆ లోటును భర్తీ చేసేందుకా అన్నట్లు పవన్ ఇప్పుడు సరికొత్త మార్గంలో వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ మార్గం తాను పూర్తి స్థాయి హిందూత్వ నేతగా అవతరించడం…అయితే పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా?…అనే ప్రశ్నలకు ఇటీవలికాలంలో ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం తాను జత కట్టిన బిజెపి భావజాలం ప్రభావమా?…లేక రాజకీయ ప్రయోజనాల కోసం అనుసరించ దల్చుకున్న ఎత్తుగడా?…అనేది కాలమే తేల్చాలి.
అంతర్వేదితో ఆరంగ్రేటం
పూర్తి స్థాయి హిందూత్వ వాదిగా తన నయా ఇమేజ్ కోసం అంతర్వేది పై ఆందోళనతో ఆరంగ్రేటం చేశారని భావించవచ్చని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇక్కడ దేవాలయంలో రథం దహనకాండపై తన ఘాటైన ప్రతిస్పందన ద్వారా పవన్ హిందూ సమాజం ముందు ఓ బలమైన హిందూత్వ వాదిగా ఆవిష్కరించుకునే యత్నం చేస్తున్నారంటున్నారు. అసలైన హిందూత్వ వాదిగా గుర్తింపు పొందిన తమ భాగస్వామ్య పార్టీ బిజెపి ఈ ఘటనపై స్పందన సుతిమెత్తగానే ఉండగా… పవన్ మాత్రం అందుకు భిన్నంగా తీక్షణమైన విమర్శలతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చీల్చిచెండాడుతూ అసలు సిసలు హిందూనేతలా కొత్త పాత్రలో తెరమీదకు వచ్చారు. ఈ విషయంలో హిందూత్వవాద మద్దతుదారులు బిజెపి నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న సోమూ వీర్రాజు కంటే రాజకీయంగా బాల్య దశలోనే ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే ఎక్కువ మార్కులు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతంలో లౌకికవాది పవన్
గతంలో పవన్ ఆయా సందర్భాలను బట్టి ముస్లింలకు, క్రైస్తవులకు అనుకూలంగా మాట్లాడేవారు. ముస్లింల గురించి…” బీజేపీ అండ చూసుకుని వైసీపీ నాయకులు మా ముస్లిం సోదరులు పైన దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోము.” ” 2001 సెప్టెంబర్ 11 న అమెరికాలో ట్విన్ టవర్ కూల్చిన సంఘటన సమయంలో అక్కడ కొందరు అమెరికా వాళ్లు నా గడ్డం చూసి నన్ను ముస్లిం అని పొరబడ్డారు, నేను వారిని చంపేస్తానేమో అని భయపడ్డారు.అప్పుడు నాకు ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అర్థమైంది.” “ముస్లింల అభ్యున్నతి కోసం సచార్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాం. క్రైస్తవులకు మద్దతుగా…
“నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నా స్నేహితుడు నాకు బాప్టిజం ఇచ్చాడు. నా భార్య క్రైస్తవురాలు. నా పిల్లలు క్రైస్తవ సంప్రదాయాలు అనుసరిస్తారు. మన క్రైస్తవ విశ్వాసం మానవత్వం ఎలా పెంపొందించాలో నేర్పుతుంది “. “క్రిస్టియానిటీ అంటే అందరి దృష్టిలో ఒక మతం కావొచ్చని కానీ తాను మాత్రం అది బాధ్యతగా భావిస్తా. నాకు దేశభక్తిని నేర్పింది కూడా క్రిస్టియన్ స్కూలే…సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో నేను చదువుకున్నా. నేను ఒక బాధ్యతతో ఇంతదూరం ప్రయాణం సాగించగలిగానంటే అందుకు కారణం అప్పుడు ఆ పాఠశాలలో నేర్చుకున్న విషయాలే పునాది”.
హిందూత్వానికి మద్దతుగా ఇటీవలి పవన్ వ్యాఖ్యలు
మొన్న పిఠాపురం…కొండబిట్రగుంట…ఇప్పుడు అంతర్వేది ఘటనలు యాధృచ్ఛికాలు కావు…ఎన్ని విగ్రహాల ధ్వంసాలు…రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయి.
ఇవి మతిస్థిమితం లేనివారి పని అనో…లేక తేనె పట్టు కోసం చేసిన పని అంటే పిల్లలు కూడా నవ్వుతారు.
పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం జరిగినప్పుడే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా?…
హిందువుల విశ్వాసాలను వైసిపి ప్రభుత్వం దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలి.
ఇతర మతాల పెద్దలు సైతం ఈ ఘటనలను ఖండించాలి. పోలీసుల దర్యాప్తు పై మాకు నమ్మకం లేదు…హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో వీటిపై విచారణ జరిపించాలి. వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే సి.బి.ఐ. దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరుతాం ఉగ్రవాద కోణం ఉంటే ఎన్ఐఏ దృష్టి సారించాలి
హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని ఖచ్చితంగా నిలిపివేయాలి. దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు అనేవి చాలా సున్నితమైన అంశాలు. గత కొన్ని నెలలుగా వరుస క్రమంలో జరిగిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించిన వ్యవహారాలు, సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన వివాదం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం…వీటి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇవి ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసేవే…
సరి కొత్త ఇమేజ్…లాభమా…నష్టమా?…
తాను కోరుకున్న హిందూత్వ వాది ఇమేజ్ ను సమకాలీన పరిస్థితులను వినియోగించుకొని పవన్ కళ్యాణ్ అంత ఒడుపుగా చేజిక్కించుకోవటంపై హిందూ సంఘాల నేతల్లో ఆనందాశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వంటి స్థాయి ఉన్న నేత తమ భావజాలాన్ని అనుసరించేందు సిద్దం కావడం తమకు తప్పకుండా గొప్ప ప్రయోజనకరం అవుతుందని వారు భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయాని కొస్తే తన సరి కొత్త ఇమేజ్ ఆయనకు లాభం చేకూరుస్తుందా నష్టం కలిగిస్తుందా అనే విషయంపై రాజకీయ పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కొత్త ఇమేజ్ ఆయనను మెజారిటీ హిందూత్వ వాదులకు దగ్గర చేసినా మరో వైపు విభిన్న వర్గాల్లో ఉన్న ఆయన మద్దతుదారులను దూరం చేస్తుందనేది ఒక విశ్లేషణ. అలాగే తనకు బేషరుతుగా అండగా నిలిచే ఒక బలమైన సామాజిక వర్గంలోని కొంతమంది సైతం ఇదే హిందూత్వ వాదం కారణంగా ఆయనకు దూరం అవ్వచ్చనేది మరో వాదన. మొత్తంగా చూస్తే సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉండే హిందువులను ఆకర్షించడం, అదే సమయంలో తన మద్దతుదారులలో ఇతర మతాల వారు దూరం అయ్యే పరిస్థితి ఉంటుందనేది వారి విశ్లేషణ. అయితే రాజకీయంగా అనేక అనుభవాలు చవిచూసిన పవన్ కళ్యాణ్ ఈ లెక్కలు బేరీజు వేసుకునే రంగంలోకి దిగి ఉంటారనే విషయాన్ని మాత్రం వారందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు.