బీజేపీ ఏం చేసినా, ఎంతలా అవమానించినా.. ఆ పార్టీతో కలిసి వెళ్ళడం తప్ప విభేదించే ఉద్దేశ్యమే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి వున్నట్లు కనిపించడంలేదు. ‘జాతీయ నాయకత్వం మనకి సముచిత గౌరవం ఇస్తోంది.. రాష్ట్ర నాయకత్వం నుంచి సరైన గౌరవం లేదు..’ అంటూ జనసేన అధినేత, తిరుపతిలో నిర్వహించిన పీఏసీ సమావేశం సందర్భంగా చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు (పార్టీ నేతల అభిప్రాయంగా మాత్రమే చెప్పినప్పటికీ) రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆటిడ్యూడ్ సినిమా రంగానికి సంబంధించి చాలా భిన్నంగా వుంటుంది. కానీ, రాజకీయాల్లో పరిస్థితులు వేరు.
బీజేపీకి ఆయనెందుకో సరెండర్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఈ కారణంగానే ‘ఏపీలో బీజేపీ నాయకత్వం మనల్ని గౌరవించకపోయినా’ అన్న ప్రస్తావన పవన్ చేస్తూ, ‘సర్దుకుపోవాల్సిందే’ అని అభిప్రాయపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది జనసేన అభ్యర్థి కాదు, బీజేపీ అభ్యర్థి అని.. ఇప్పటికే బీజేపీ తేల్చేసింది. పవన్ మాత్రం, ఇంకా జనసేన శ్రేణుల్లో ఏవో ఆశలు పెడుతున్నారు. ఇవే జనసేన పార్టీని దెబ్బతీస్తున్నాయి. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యాక, వారిని ఉస్సూరుమనిపించారు జనసేనాని.. అదీ బీజేపీ కోసం. ఓ పది సీట్లలో అయినా జనసేన పార్టీ పోటీ చేసి వుంటే, ‘తెలంగాణలోనూ జనసేన వుంది’ అని చెప్పుకోడానికి వీలుండేది. ఇన్ని అవమానాలు.. అదే సినీ రంగంలో అయితే, జనసేనాని ససేమిరా సహించేవారు కాదు. కానీ, రాజకీయాల్లో మాత్రం చాలా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. జనసైనికుల్ని అవమానపడేలా చేస్తున్నారు. ఎన్నికలనేవి ఏ రాజకీయ పార్టీకైనా చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భాలు. బీజేపీతో పోల్చితే, ఆంధ్రపదేశ్‌లో జనసేన బలం ఎక్కువ. అయినాగానీ, బీజేపీ తాము బరిలోకి దిగుతామంటోంది.. అదీ జనసేన మద్దతుతో. అయినా, జనసేన.. బీజేపీకి మద్దతివ్వడంపైనే దాదాపు మొగ్గు చూపుతోంది. కాదు, ఆ పరిస్థితుల్లోకి జనసేనను బీజేపీ నెట్టేసింది. బీజేపీ చెట్టు నీడన జనసేన ఎదగడం అనేది దాదాపు అసాధ్యమని ఇంకోసారి నిరూపితమైపోయింది.