పవన్ కళ్యాణ్ కొత్త సినిమా, వచ్చి వెళితే ఎలాంటి హడావిడి వుంటుందో, అలాంటి హడావిడి.. ఆయన జనంలోకి వెళ్ళినా కనిపిస్తోంది. అంతే తప్ప, పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్‌లా.. ఆయన చేస్తున్నవి రాజకీయ కార్యక్రమాల్లా కనిపించవు. పవన్ కళ్యాణ్‌కి సినీ ప్రేక్షకుల్లో వున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అయితే, రాజకీయ తెరపై ఆయన ‘షో’ మాత్రం ఆశించిన స్థాయిలో వర్కవుట్ కావడంలేదు. అందుక్కారణాల్లో అతి ముఖ్యమైనది నిలకడలేమి. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పంటను కోల్పోయిన రైతుల్ని పరామర్శిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంచి కార్యక్రమమే ఇది. ఏ రాజకీయ పార్టీ అయినా, ఇలాంటి సందర్భాల్లో చేయాల్సింది.. రైతుల్ని పరామర్శించడమే. పవన్ కళ్యాణ్‌కి సినీ ఫాలోయింగ్ ఎక్కువ గనుక, ఆయన అడ్రస్ చేసే విషయం ఎక్కువమందికి రీచ్ అవుతుంది.. ప్రభుత్వానికీ చేరుతుంది.. ప్రభుత్వం దిగొచ్చేలా చేయగలుగుతుంది. కానీ, సమస్య ఏంటంటే, ఇలాంటి సమస్యలపై నినదించే పవన్ కళ్యాణ్, ఎక్కువ కాలం ఆ అంశాన్ని పట్టుకుని నిలబడరు.
విశాఖ వేదికగా ఇసుక పోరాటం..
కొన్నాళ్ళ క్రితం విశాఖ వేదికగా జనసేన అధినేత ఇసుక సమస్యపై ‘లాంగ్ మార్చ్’ చేశారు. అప్పట్లో జనసేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ, ఏం లాభం, చాలా తొందరగానే ఆ ఉత్సాహం నీరుగారిపోయింది. ఆ తర్వాత పలు కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్. అభిమానులు చాలా కష్టపడుతున్నారు.. జనసైనికులూ తమవంతుగా కృషి చేస్తున్నారు. కానీ, అధినేత పవన్ కళ్యాణ్‌లోనే చిత్తశుద్ధి లోపిస్తోంది. పవన్ కళ్యాణ్ గనుక, వీలైనంత ఎక్కువగా ప్రజల్లో వుంటూ, పార్టీని బలోపేతం చేసుకోగలిగితే, ఆయన వెంట నాయకులు కూడా బలపడతారు. కానీ, అంత తీరిక పవన్ కళ్యాణ్‌కి వుండటంలేదు.

సినిమాల సంగతేంటి జనసేనానీ.?
పవన్ కళ్యాణ్ కోసం దాదాపు అరడజను మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. వాటిల్లో కొన్ని సినిమాలో సెట్స్ మీదకు వెళ్ళిపోయాయి. వాటిని పూర్తి చేయడం పవన్ కళ్యాణ్‌కి చాలా చాలా ముఖ్యం. నిర్మాతలకీ అంతే. అయితే, ఆ కార్యక్రమాలు పక్కన పెట్టి, జనంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్. దాంతో దర్శక నిర్మాతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కానీ, పవన్ అన్ని విషయాల మీదా స్పష్టతతోనే జనంలోకి వచ్చారన్నది జనసేన వర్గాల వాదన.
రైతులకు జనసేనాని భరోసా.. సెహబాష్.!
జనసేనాని ఇచ్చిన భరోసా రైతులకు కొంత ఊరటనిచ్చిందనడం నిస్సందేహం. పంట నష్టం నేపథ్యంలో ఎకరానికి 35 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలంటూ జనసేనాని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వాలు ఎంత మేలు చేసినా అది తక్కువే. ఎందుకంటే, రైతు బావుంటేనే.. దేశం బావుంటుంది. ఈ నెల 7వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ జనసేన పార్టీ ఈ కార్యక్రమాల్ని చేపట్టబోతోంది.
