ఇప్పటం గ్రామానికి జనసేనాని పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్.!

మొన్నామధ్య 50 లక్షల రూపాయల్ని ఇప్పటం గ్రామ అభివృద్ధికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా, రోడ్ల వెడల్పు పేరుతో వైసీపీ సర్కారు కూల్చేసిన ఇళ్ళకు సంబంధించి బాధితులకు ఆర్థిక సహాయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ప్రభుత్వాలన్నాక కూల్చివేతలు సర్వసాధారణం. రోడ్ల వెడల్పు పేరుతోనో, రాజకీయ కక్ష సాధింపుల కోసమో.. కూల్చివేతలు చేయడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణం. అధికారంలో ఎవరున్నా ఇలాంటివి మామూలే అయిపోతున్నాయ్.!

ఇప్పటం గ్రామస్తులు గతంలో జనసేన పార్టీ బహిరంగ సభ కోసం తమ భూమిని ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే జనసేన అధినేత, ఆ బహిరంగ సభ వేదికగానే ఇప్పటం గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ మొత్తాన్ని వైఎస్సార్ కళ్యాణ మండపం కోసం ఇచ్చెయ్యాలంటూ గ్రామంపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అధికార పార్టీ ఒత్తిళ్ళకు గ్రామస్తులు తలొగ్గకపోవడంతో, రోడ్ల వెడల్పు పేరుతో కొన్ని ఇళ్ళను ధ్వంసం చేశారన్నది ప్రస్తుతం వినిపిస్తోన్న ఆరోపణ. అబ్బే, అదేం లేదు.. రోడ్ల వెడల్పు అనేది పద్ధతి ప్రకారం జరుగుతోందని అధికార వైసీపీ చెబుతోంది. ఇళ్ళు కూల్చేయలేదనీ.. ఆక్రమణల్ని మాత్రమే తొలగిస్తున్నామని వైసీపీ అంటోంది.

సరే.. ఎవరి వాదనలు వారివే.! ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ది కోసం జనసేనాని తనదైన వ్యూహాన్ని రచించారు. ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించేశారు. దాన్ని స్వయంగా వారికి అందిస్తారట కూడా. రాజకీయాల్లో ఈ తరహా ‘సాయం’ ఇంతకు ముందెన్నడూ లేదన్నది నిర్వివాదాంశం. జనసేనాని చేసే సాయం, వైసీపీని రాజకీయంగా దెబ్బ తీస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.