ప్రస్తుతం రాష్ట్రంలోని హాట్ టాపిక్ హిందూ మతాల మీద దాడి. వరుసగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుండటంతో మొన్నటి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్దమైన దుర్ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పిఠాపురం, నెల్లూరు, అంతర్వేది.. ఇలా వరుస ఘటనలతో భక్తుల మనసు తీవ్రంగా నొచ్చుకుంది. నిజంగా హిందూ మతం మీద దాడి జరుగుతోందా అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడం, ఇప్పటికీ ఒక్క ఘటనలో కూడ ఖచ్చితమైన కారణాన్ని కనుగొనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈమధ్యలో బీజేపీ లాంటి రాజకీయ పార్టీలు దూరిపోయి మతం, హిందూత్వం, క్రిస్టియానికీ పెరుగుతోంది అంటూ సున్నితమైన అంశాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. టీడీపీ నేతలు అధికార పక్షం మీద విరుచుకుపడటానికి, రాజకీయ లబ్ది పొందడానికి ఈ ఘటనను వాడేసుకుంటున్నారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమే భాధ్యతాయుతంగా మాట్లాడారు. అందరికంటే చివర్లో మాట్లాడినా నిజం మాట్లాడారు. శాంతియుతంగా ఆలోచించేలా సమస్యను వివరించారు.
హిందూ మతం తరపున మాట్లాడాలంటే భయం:
పవన్ తన ప్రసంగంలో బలంగా చెప్పిన విషయం లౌకికవాదం పేరుతో హిందూ మతం నిర్లక్ష్యానికి గురవుతోంది అని. నిజమే ఈమధ్య కాలంలో చాలామంది హిందూ మతాన్ని కాపాడాలని ఎవరైనా అంటే వారిని విచిత్రంగానే చూస్తున్నారు. ఎక్కడైనా అంతర్వేది లాంటి ఘటనలు జరిగి హిందువులు బయటికొస్తే లౌకికవాదం అంటే ఇది కాదు అంటూ లౌకికవాదానికి కొత్త అర్థం చెబుతున్నారు. మళ్లీ వీళ్ళే ఇతర మతాల విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగితే వెంటనే బయటికొచ్చి ఆయా మతాల కోసం మాట్లాడేస్తారు. హిందూ దేశంలో ఇతర మతాలకు భద్రత లేదని అనేస్తారు. సరిగ్గా ఇలాంటి కుహానా లౌకికవాదుల గురించే పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
అసలైన లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా చూడటం. అంతేకానీ మెజారిటీ జనమున్న మతాన్ని తక్కువ సమానంగా, మైనారిటీ జనం ఉన్న మతాన్ని ఎక్కువ సమానంగా చూడటం కాదు. ఏ ఒక్క మతానికి అన్యాయం జరిగినా అన్ని మతాలవారు బయటికొచ్చి మద్దతివ్వాలి. ఈ కుహానా లౌకికవాదుల వలన హిందూ మతానికి నష్టం జరిగితే బయటికొచ్చి మాట్లాడలేకున్నారు జనం. మళ్లీ ఎక్కడ మత పిచ్చి అంటారేమోననే భయం. ముందు ఈ పద్దతి మారాలి. అందరూ సమానమే, అందరి కోసం అందరూ, అన్ని మతాల కోసం అన్ని మతాలు అనే భావన రావాలి అంటూ లౌకికవాద అసలైన లక్షణాన్ని చెప్పారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదు:
ప్రభుత్వంలో ఎస్కేపిస్టులు ఎక్కువయ్యారన్న పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలు సైతం కుహానా లౌకికవాదుల్లానే ఉంటున్నాయి. హిందూ మతం మీద దాడులు జరిగితే నీరసంగా స్పందించడం, ఇతర మతాల విషయంలో వేగంగా రియాక్ట్ కావడం చేస్తున్నారు. ఇది తగదు. యాదృచ్ఛికం, యాదృచ్ఛికం అంటున్నారు. మరీ ఇన్ని యాదృచ్ఛికాలా. ఎక్కడ చూసినా మతిస్థిమితం లేనివారు చేశారని, తేనెతెట్టుకు నిప్పు పెడితే రథం అంటుకుందని చెబుతున్నారు. కానీ ఇవి అలా అనిపించట్లేదు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఆకతాయిలు చేశారా, చేసేవాళ్లు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. అంతేకానీ స్కూల్ పిల్లలు కూడ నమ్మలేని కారణాలు చెప్పి తప్పించుకోకూడదు అంటూ గట్టిగా మాట్లాడారు.
ఆడవాళ్ళే ఎదిరించాలి:
మతంతో చిక్కుబడిన ఈ సమస్యకు అన్ని పార్టీలు ఉద్రేకపూరిత పరిష్కారాన్నే చెబుతున్నాయి. బీజేపీ అయితే హిందువులంతా రోడ్లమీదకు వచ్చి గందరగోళం చేయాలన్నట్టు మాట్లాడితే టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని సెలవిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువ బాధ్యతను ఆడవాళ్లు తీసుకోవాలని అన్నారు. ఇది దుర్గాదేవిని పూజించే భూమి. ఆడవాళ్లు నిత్యం గుళ్లకు వెళ్ళి పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అందరికన్నా వారి మనోభావాలే ఎక్కువ దెబ్బతిని ఉంటాయ్. కాబట్టి వారే బయటికి రావాలి. ఎవరికి వీలైన రీతిలో వారు నిరసన తెలిపాలి. లేకుంటే ఇంట్లో, వంటగదుల్లో కూర్చొని బాధపడటమే మిగులుతుంది. ఆడవాళ్ళే ఎదిరించాలి, వారంతా బయటకు రావాలని కొరుకుంటున్నా. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందంటూ మహిళల పోరాటంతో శ్రేయస్కర పరిష్కారానికి మార్గం చూపారు.