గత లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థినిగా పోటీ చేసి సుమారు రెండున్నర లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి చంద్రబాబు మళ్ళీ ఉపఎన్నికలో పోటీ చెయ్యడానికి పిలిచి మరీ టికెట్ ఇచ్చాడు. అయితే విచిత్రంగా పనబాక లక్ష్మి నుంచి ఎలాంటి సంతోషపూర్వకమైన ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. తెలుగుదేశం లాంటి ప్రధాన ప్రతిపక్షం, మొన్నటివరకు అధికారపక్షం, సామాజికంగా, ఆర్ధికంగా చాలా బలమైన పార్టీ పిలిచి పీట వేసినపుడు ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అధినాయకుడి జేజేలు కొడుతూ పల్లకీలో ఊరేగుతూ నాయకుడి మెప్పు కోసం అధికారపార్టీని విమర్శిస్తారు.
కానీ, చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన వారం రోజుల తరువాత కూడా పనబాక నుంచి ఎలాంటి బాకాలు లేవు సరికదా…ఆమె బీజేపీలోకి గంతు వెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో చంద్రబాబు పరువు గంగపాలైంది. అందరికన్నా ముందే మేలుకుని అభ్యర్థిని ప్రకటించి చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారని పచ్చమీడియా తెగ భజన చేసి తరించింది. చంద్రబాబు వేసిన స్టెప్ పార్టీ కార్యకర్తలతో ఉత్సాహంగా స్టెప్పులు వేయిస్తుందని ఊదరగొట్టాయి. తీరా చొస్తే పనబాక లక్ష్మి బీజేపీ అభ్యర్థిగా దిగితే లక్షీకటాక్షం లభిస్తుందని ఆశపడుతున్నట్లు తెలుస్తున్నది.
బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఓటమి తప్పదని పనబాకకు కూడా తెలుసు. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ అన్న కవి వాక్యం నిజమవుతుంది. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ. ఆరేళ్లుగా అధికారంలో ఉన్నది. మరో నాలుగేళ్లు ఉంటుంది. ఆ తరువాత కూడా బీజేపీయే వస్తుంది. బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పురందేశ్వరికి ఇప్పుడు జాతీయస్థాయి పదవి దక్కింది. తాను కూడా మాజీ మంత్రియే కాబట్టి తిరుపతిలో ఓడిపోయినా భవిష్యత్తుకు డోకా ఉండదని పనబాక ఆలోచనగా చెబుతున్నారు. పైగా బీజేపీకి జనసేనకు మైత్రి ఉండటంతో కాపుల ఓట్లు తనకు పడే అవకాశం ఉంటుంది. గెలిచినా గెలవకపోయినా డిపాజిట్ అయితే దక్కుతుంది. అదే తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఓటమి ఎదురైతే భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నట్లే. ఇక శాశ్వతంగా ఇంట్లో కూర్చోవాల్సిందే.
ఇన్ని ఆలోచనల నడుమ తనకు చంద్రబాబు ఆర్భాటంగా టికెట్ ఇస్తామని ప్రకటించినప్పటికీ పనబాక వర్గం నుంచి కుయ్ కయ్ సౌండ్ లేదు. పనబాక మౌనంతో ఇప్పుడు చంద్రబాబు మనోవేదనకు గురవుతున్నారు. కృతజ్ఞతలు చెప్పాల్సిన పనబాక అసలు తన సముఖానికి కూడా రాకపోవడంతో ఆయన ముఖం మాడిన దిబ్బరొట్టెలా తయారైందని తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు!
కాలమహిమ పాపం! మహాశివుడంతటివాడినే చెట్టు తొర్రలో కూర్చోబెట్టింది!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు