ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మంటలు పుట్టిస్తున్న వేళ.. అమెరికా దూకుడుగా రంగంలోకి దిగింది. అయితే ఈ పరిణామాలన్నింటికి దూరంగా ఉండాల్సిన పాకిస్తాన్ ఒక్కసారిగా ఆసక్తికరంగా వ్యవహరిస్తోంది. ప్రపంచం అంతా నిశ్శబ్దంగా చూస్తున్న వేళ.. పాక్ మాత్రం గంటా గంటకూ తన వైఖరిని మార్చుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కొన్ని రోజుల క్రితం వరకు అమెరికాపై ప్రశంసల వర్షం కురిపించిన పాకిస్తాన్.. ఇప్పుడు తిరుగుబాటు స్వరం ఎత్తింది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో విందు తీసుకున్నారు. అంతే కాకుండా ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని స్వయంగా ఆయన కోరారు. దీనికి ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా మద్దతు పలికారు. అంతటితో ఆగకుండా.. పాక్ ప్రభుత్వం అధికారికంగా ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది.
అయితే ఇదంతా జరిగిన మరుసటి రోజే పాక్ పూర్తిగా తన వైఖరిని మార్చుకుంది. అమెరికా ఇరాన్‌పై చేసిన వైమానిక దాడిని పాక్ తీవ్రంగా ఖండించింది. ఇదే ప్రభుత్వమే.. ఇదే నాయకత్వం.. ఒకపక్క అమెరికాకు ప్రశంసలు గుప్పిస్తే, మరొకపక్క దాడులపై వ్యతిరేకంగా గళం వినిపించడమేమిటని అంతర్జాతీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని విమర్శించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఇరాన్‌కు తనను తానే రక్షించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చని, పరిస్థితిని మితిమీరే దిశగా నెట్టొచ్చని మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉండగా… పాకిస్తాన్, ఇరాన్‌లు 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో యుద్ధ ప్రభావం తమపై పడే ప్రమాదం ఉందని పాక్ అంచనా వేస్తోంది. అందుకే ఇజ్రాయెల్, ఇరాన్‌లను నేరుగా ఉద్దేశిస్తూ, సైనిక దాడులు కాకుండా, దౌత్య మార్గంలోనే సమస్యలు పరిష్కరించుకోవాలి అని పిలుపునిచ్చింది. ఒక్క రోజు వ్యవధిలో అమెరికా కోసం నోబెల్ కోరి, మరుసటి రోజే అదే అమెరికాను తప్పుబట్టిన పాకిస్తాన్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ నిబద్ధతపై ప్రశ్నలు రావడం కూడా ఇదే కారణం. అసలు పాక్ ధోరణి ఏంటో అంతుబట్టని పరిస్థితి ఉంది.