యూ టర్న్ తీసుకున్న పద్మినీ రెడ్డి, బిజెపికి ఉల్టా షాక్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గురువారం ఉదయం నుంచి షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ సతీమణి పద్మినీరెడ్డి అనూహ్యరీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మధ్యాహ్నం బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, బిజెపి జాతీయ నేత మురళీధర్ రావుల సమక్షంలో ఆమె బిజెపి గూటికి చేరారు. 

అయితే ఈ వార్త కాంగ్రెస్ పార్టీకి డ్యామేజీ కలిగే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ సతీమణి పార్టీ మారడంతో కలకలం రేపింది. ఈ పరిణామంపై పద్మినీరెడ్డి భర్త దామోదర ఎక్కడ కూడా మీడియాతో కానీ, బయట కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే ఆయన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక పద్మినీరెడ్డి కుమార్తె కూడా తండ్రికే మద్దతు పలికారు. తన తల్లి ఊహించని రీతిలో బిజెపిలో చేరిపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. ఆమెతోపాటు కార్యకర్తలు కూడా తీవ్రమైన వత్తిడి తెచ్చారు. వారే కాదు కాంగ్రెస్ అధిష్టానం కూడా పద్మినీరెడ్డి మీద వత్తిడిపెంచినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె 9గంటలు గడవకముందే యూ టర్న్ తీసుకున్నారు.

తాను బిజెపిలోకి వెళ్లబోనని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ఆమె తన భర్త రాజనర్సింహ్మ సమక్షంలో మళ్లీ కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పద్మినీరెడ్డి మాట్లాడారు. తాను బిజెపిలో చేరిన విషయం వాస్తవమేనన్నారు. అయితే తాను ప్రస్తుతం మనసు మార్చుకున్నానని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానన్నారు. 

ఆమె బిజెపి ఆఫీసుకు వచ్చి బిజెపిలో చేరి తిరిగి సంగారెడ్డిలోని తన నివాసానికి చేరుకోగానే కేడర్ అంతా ఆమెపై వత్తిళ్లు తెచ్చారు. దాంతో ఆమె మనసు మార్చుకున్నట్లు ప్రకటించారు. నిన్న పద్మినీరెడ్డి, దామోదర ఇద్దరి మధ్య స్వల్ప విబేధాలు చోటు చేసుకున్నాయని కార్యకర్తలు అంటున్నారు. అందుకోసమే ఆమె అకస్మాత్తుగా నేరుగా బిజెపి ఆఫీసుకు వెళ్లి పార్టీలో జాయిన్ అయిపోయారని అంటున్నారు.

తాను కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకున్నానని కాంగ్రెస్ లోకి తిరిగొచ్చిన తర్వాత పద్మినీరెడ్డి అన్నారు. తనకు టికెట్ విషయంలోనే అసంతృప్తితో పార్టీ మారాలనుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబానికి ఒకే సీటు అన్న నిర్ణయం కారణంగానే ఆమె బిజెపి గూటికి చేరినట్లు తెలుస్తోంది. బిజెపి పార్టీలో చేరితే సంగారెడ్డి టికెట్ తీసుకుని తాను సునాయాసంగా గెలుస్తానన్న ధీమాతోనే ఆమె బిజెపి గూటికి చేరినట్లు తెలుస్తోంది.

బిజెపి ఆమెకు సంగారెడ్డి టికెట్ ఆఫర్ పెట్టినట్లు ప్రచారంలోఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అక్కడ ఈసారి పోటీ చేసే అవకాశం ఉండడంతో ఆయనను కాదని పద్మినీరెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆమె కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే మిగతా పార్టీలన్నీ మహా కూటమి పేరుతో కలిసిపోవడంతో బిజెపి ఆప్షన్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. 

అయితే ఆమె నిర్ణయం పట్ల సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. సంగారెడ్డిలోని పద్మినీరెడ్డి ఇంటికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి సంగారెడ్డి కాంగ్రెస్ లో అలజడి రేగింది. సంసారాల్లో బిజెపి నిప్పులు పోస్తోందని కార్యకర్తలు మండిపడ్డారు. భార్యాభర్తలను విడదీసే కల్చర్ బిజెపికి తగదన్నారు.

మరోవైపు తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా పద్మినీరెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన సమయంలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ అన్నారు. కానీ ఇప్పుడు ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై మరి హరీష్ రావు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

మరోవైపు పద్మినీరెడ్డి యూ టర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటి?

ఆమెకు కాంగ్రెస్ లో టికెట్ ఇస్తామన్నారా?

లేదంటే తన భర్తకు తలవొంపులు తీసుకురావొద్దన్న ఉద్దేశంతోనే బిజెపిని వీడి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నారా?

తాను బిజెపిలో చేరుతున్న విషయం తన భర్తకు తెలుసు అని ప్రకటించిన ఆమె మళ్లీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు.

దీనివల్ల కాంగ్రెస్ కు లాభమా? నష్టమా? బిజెపికి లాభమా? నష్టమా?

పద్మినీరెడ్డి ఎందుకు ఇలా వ్యవహరించారు?  

ప్రస్తుతం పై ప్రశ్నలన్నింటికీ జవాబులు తేలాల్సి ఉంది.

 

 

పద్మినీరెడ్డి బిజెపిలో చేరిన వార్త కోసం క్లిక్ చేయండి…