కే‌సి‌ఆర్ మైండ్ గేమ్ తో మోడీ రివర్స్ ఆట – TG లో ‘ ఆపరేషన్ CM చైర్ ‘

Modi Reverse Game To KCR Mind Game

కేసీఆర్‌కు రివర్స్, అదే స్ట్రాటజీతో బీజేపీ నేతల దూకుడు

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రాజకీయం అంతా టీఆర్ఎస్, కాంగ్రెస్ చుట్టూనే ఎక్కువగా తిరిగింది. కానీ ఏడాది కాలంగా టీఆర్ఎస్, బీజేపీ చుట్టూ తిరుగుతోంది. లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కు(9) పరిమితం కావడం, కాంగ్రెస్(3) కంటే ఒక సీటును బీజేపీ(4) ఎక్కువగా గెలుచుకోవడం గమనార్హం. బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అయ్యాక టీఆర్ఎస్ మరింతగా దూకుడు పెంచిందని అంటున్నారు.

Modi Reverse Game To KCR Mind Game
BJP Strategy To KCR Mind Game

నరేంద్రమోడీ ప్రభావంతో కొన్నేళ్లుగా బీజేపీ తెలంగాణలో బలం పుంజుకోవడం ఒక కారణమైతే, ఇప్పుడు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి దూకుడుగా వెళ్లే నేతల్లో తెలంగాణ పగ్గాలు ఉండటం మరో కారణమని చెబుతున్నారు. దీనికి రఘునందనరావు వంటి మాటకారులు జత కలిశారు. అంతకుముందు ఉన్న ఇదే పదవుల్లో ఉన్న నేతల కంటే ప్రస్తుతం ఉన్నవారు దూకుడుగా వెళ్తూ ప్రజల్లో నానడం టీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సహా నేతలు అందరూ ఘాటు పదాలు ఉపయోగిస్తూ, రెచ్చగొట్టేలా మాట్లాడారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీతో తెలంగాణ బీజేపీ నేతలు వెళ్తుండటాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేని పరిస్థితి అంటున్నారు.

అప్పుడే దుబ్బాకపై చర్చ

నరేంద్రమోడీ హవా ఉత్తరాది అంతగా మనవద్ద కనిపించకపోయినప్పటికీ, ఆ ప్రభావం మాత్రం ఎక్కువే ఉంది. యువత ఎక్కువగా మోడీ వైపు చూస్తున్నారు. దీనికి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు, డీకే అరుణ లాంటి దూకుడైన నేతలు తోడు కావడమే టీఆర్ఎస్ పదేపదే టార్గెట్ చేయడానికి కారణంగా మారిందని చెబుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపే చూస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ఇటీవల కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. అక్కడ ఉప ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటాపోటీ అని, కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అనే వాదనలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.

ఏపీ అభిమానుల చూపు కూడా తెలంగాణ వైపు

కరోనా మహమ్మారికి సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్రాలకు భారీగా నిధులు ఇచ్చింది. ఈ నిధుల ఏం చేశారని బీజేపీ నేతలు నిలదీస్తుంటే, తమకు సరిపోయే నిధులు రాలేదని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కొడంకల్ రైల్ కోచ్ పరిశ్రమ శంకుస్థాపనలో బీజేపీని ఓ విధంగా నిలదీశారు. ఇతర మంత్రులు కూడా కేంద్రం నుండి సహకారం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. 2023 ఎన్నికల నాటికి తెలంగాణ బీజేపీ ఏకంగా అధికారం పైనే ఆశలు పెట్టుకుంది. ఇందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ అభిమానులు కూడా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి గట్టి నాయకత్వం తమ కమలదళానికి కావాలని కోరుకున్నారు. అంటే ప్రస్తుత తెలంగాణ బీజేపీ నాయకత్వం ఎలాంటి దూకుడుతో ముందుకు సాగుతుందో ఇట్టే తెలిసిపోతోంది.

సై అంటే సై

ఇటీవల వరంగల్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై దాడి యత్నాన్ని క్షణాల మీద ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత నాయకత్వం ఎంత దూకుడుగా ఉందంటే.. వాళ్లు కొడితే మేం నోర్మూసుకొని కూర్చోవాలా.. వారు ఏం చేస్తే మేం అది చేసేందుకు సిద్ధమనే విధంగా మాట్లాడుతోంది.

Modi Reverse Game To KCR Mind Game
BJP vs TRS

ఈ విషయంలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘునందన రావు.. ఇలా అందరూ ఒకేవిధంగా మాట్లాడుతున్నారు. సాధారణంగా దాడులు జరిగితే తమ పార్టీ నేతపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, ఇలాంటి వైఖరి సరికాదని చెప్పి ఊరుకోవడం సహజం. కానీ మీరేం చేసినా కూర్చోలేమని, దానికి తగినట్లుగా స్పందిస్తామని దూకుడుగా వెళ్తోంది కొత్త బీజేపీ నాయకత్వం. వారి దూకుడుకు యువతలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే 2023లో ఇది అధికారాన్ని తెచ్చిపెడుతుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు పదేపదే బీజేపీని టార్గెట్ చేయడం చూస్తుంటే మాత్రం ప్రత్యామ్నాయం మాత్రం కమలదళమని తేలిపోయిందని అంటున్నారు.