ఇజ్రాయేల్ లో ఇండియన్స్… “ఆపరేషన్ అజయ్” డిటైల్స్ ఇవే!

ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య భీకర పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 2,265 మంది మరణించారు. వీరిలో ఇజ్రాయెల్‌ లో 1,200 మంది చనిపోగా.. గాజాలో 1,050 మంది మరణించారు. వీరిలో 260 మంది పిల్లలు, 230 మంది మహిళలు ఉన్నారు. ఈ సమయంలో యుద్ధ తీవ్రత దృష్ట్యా ఇజ్రాయిల్‌ లో చిక్కుకున్న ఇండియ‌న్స్‌ ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఆపరేషన్‌ అజయ్‌ ను ప్రారంభించింది.

అవును… భీకరంగా జరుగుతున్న హమాస్ – ఇజ్రాయేల్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల కోసం తాజాగా కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

ప్రస్తుతం ఇజ్రాయిల్‌ లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో… విదేశాల్లోని భారతీయుల భద్రత కోసం కట్టుబడి ఉన్నామంటూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ట్విట్టర్ లో ప్రకటించారు. ఇండియాకు తిరిగిరావడానికి రిజిస్టర్ చేసుకున్న వారి కోసం శుక్రవారం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయిల్‌ లోని రాయబార కార్యాలయం పూర్తీ వివరాలు వెల్లడించింది.

ఇజ్రాయేల్ లో జరుగుతున్న భయంకర యుద్ధం నేపథ్యంలో… ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, అక్కడున్న ఇండియన్స్ కి సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలోనూ ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో… అక్కడి భద్రతా బలగాల సాయంతో ఆపరేషన్ అజయ్‌ ను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా… ఢిల్లీ కంట్రోల్‌ రూం నంబర్లు, ఈ మెయిల్‌ చిరునామా వివరాలు వెల్లడించింది. వాటి ప్రకారం… 1800 118 797 (టోల్‌ఫ్రీ), +91 11-23012113, +91 11-23014104, +91 11-23017905, +91 99682 91988, situationroom@mea.gov.in

ఇక ఇజ్రాయేల్ లోని భారత రాయబార కార్యాలయాలు టెల్‌ అవీవ్‌, రమల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ వివరాలు +972 35226748, +972 543278392, cons1.telaviv@mea.gov.in… +970 592916418, rep.ramallah@mea.gov.in అని తెలిపింది.