దుబ్బాక ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తరహాలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అభిమానుల ఓట్లతో పాటు తెరాస వ్యతిరేక ఓట్లను కూడ పూర్తి స్థాయిలో చేజెక్కించుకునేలా పక్కా ప్రణాళికతో ఎన్నికలకు సన్నద్ధమైంది కాంగ్రెస్. ఈ ఎన్నికల మీద తొలి నుండి భారీ హోప్స్ పెట్టుకున్న కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావును రంగంలోకి దింపారు. ఎలాగైనా దుబ్బాక స్థానాన్ని మరోసారి నెగ్గుకురావాలని పంపారు. నిజానికి తాను లేదా తన కుమారుడు కేటీఆర్ పనుల్లోకి దిగకుండా హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ కేసీఆర్ తీసుకున్న ఈ స్టెప్ నిజంగా మంచిదే.
అదే జిల్లాకు చెందిన నేత కావడం పార్టీలో కీలక వ్యక్తిగా ఉండటంతో హరీశ్ రావుకు దుబ్బాకలో మంచి నెట్వర్క్ ఉంది. అది కలిసొస్తుంది. ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించినా హరీశ్ రావు పవర్ బ్రహ్మాండంగా పనిచేసి భారీ మెజారిటీ రావడం ఖాయం. ఇక టికెట్ ఎలాగూ సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతకే ఇచ్చారు కనుక సానుభూతి ఓట్లు ఖాయంగా పడతాయి. ఇన్ని జరిగినా కేసీఆర్ ఆశిస్తున్న లక్ష ఓట్ల మెజారిటీతో వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ తన గేమ్ ప్లాన్ మార్చడమే. ఉప ఎన్నిక టికెట్టును నర్సారెడ్డికి కాకుండా చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలని హస్తం హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
నిన్నటివరకు తెరాసలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో తిరుగుబాటు ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పెద్దలు ఆయనకు ఈ ఉప ఎన్నికల్లోనే కాకుండా వచ్చే ఎన్నికల్లో కూడ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. పాత పరిచయాలను, సొంత శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్దం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం శ్రీనివాస్ రెడ్డి ఒకప్పుడు తమవాడే కాబట్టి ఆయన అభ్యర్థిత్వం విషయంలో సంతోషంగానే ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ నుండి దుబ్బాకకు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన చెరుకు ముత్యం రెడ్డి కుమారుడే ఈ శ్రీనివాస్ రెడ్డి.
దుబ్బాక, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి అటుఇటుగా హరీశ్ రావుతో సరితూగగలిగిన నేతనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ ఆయన్ను ఆదరించి టికెట్ ఇస్తోంది. ఈయన ఎంట్రీతో తెరాస విజయం మరింత జఠిలం అవుతుందనడంలో అనుమానమే లేదు. ఇకవేళ గెలిచినా కూడ కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్న లక్ష ఓట్ల మెజారిటీ మీద ఆశలు ఒదిలేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో ఇక్కడ తెరాస తరపున సోలిపేట రామలింగారెడ్డి సాధించిన 62 వేల పైచిలుకు మెజారిటీ కూడ కష్టమే అంటున్నారు పరిశీలకులు.