కత్తి పోటు.! అత్యంత తీవ్రమైన నేరమే.. క్షమార్హం కానే కాదు.!

అది ఆంధ్రప్రదేశ్ కోడి కత్తి.. ఇది తెలంగాణ కోడి కత్తి.! మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన గురించి తొలుత వినిపించిన వాదన ఇది. సోషల్ మీడియా వేదికగా ‘తెలంగాణ కోడి కత్తి’ వ్యవహారం ట్రెండింగ్ అయి కూర్చుంది కూడా.

కానీ, అసలు విషయం వేరే.! ఇది అత్యంత తీవ్రమైన ఘటన.! నిందితుడు కాంగ్రెస్ కార్యకర్త అని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నిందితుడు.. అంటోంది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాలు పక్కన పెడితే, ఓ ఎంపీ మీద ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడటాన్ని అన్ని రాజకీయ పార్టీలూ ఖండించి తీరాలి.

మానవత్వం వున్నవారెవరూ ఈ ఘటనను సమర్థించకూడదని, కొత్త ప్రభాకర్ రెడ్డికి జరిగిన సర్జరీ వ్యవహారంతో స్పష్టమవుతోంది. సర్జరీ చేసి చిన్న పేగుని కొంత భాగం మేర కట్ చేశారట. ఇది అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్స అని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

చెప్పడమేంటి.? చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, సర్జరీ ప్రాసెస్ తాలూకు పొటోల్ని బ్లాక్ అండ్ వైట్‌లో విడుదల చేశారు. ఓ వీడియో కూడా ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది.

కేవలం కోడి కత్తి ప్రచారం నేపథ్యంలోనే, సర్జరీ సంబంధిత వ్యవహారాల్ని విడుదల చేస్తున్నారా.? లేదంటే, సెంటిమెంట్ పండటానికి ఇవన్నీ చేస్తున్నారా.? అన్న కోణంలోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం. జరిగింది ఆషామాషీ దాడి కాదు.

గెలుపోటముల సంగతి తర్వాత.. ముందైతే ప్రాణాలు వుండాలి కదా.? రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో అత్యంత అప్రమత్తంగా వుండాలి. అభ్యర్థులకు పోలీసులు సరైన భద్రత కల్పించాలి.