తెలంగాణలో మొత్తం 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యాక జనసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికి టీడీపీ, బీజేపీలతో పొత్తు విషయమై జనసేనకు పూర్తి క్లారిటీ లేదు.
ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ నాయకత్వం, జనసేన అధినేత వద్దకు వెళ్ళి, మంతనాలు జరిపిందో.. ఆ తర్వాత సీన్ మారింది. పనిలో పనిగా జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని పరామర్శించి, తెలంగాణ రాజకీయాల గురించీ చర్చించారనుకోండి.. అది వేరే సంగతి.
ముప్ఫయ్ రెండు కాదుగానీ, 12 సీట్లలో పోటీ చేస్తామని జనసేన లీకులు ఇచ్చింది. ఆ పన్నెండు కాస్తా, ఇప్పుడు కేవలం 8 మాత్రమే అయి కూర్చుంది. అందులోంచి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఔట్ అయిపోయింది.
వాస్తవానికి కూకట్‌పల్లిలో జనసేన నేతలే పోటీ చేయాలనుకున్నారు.. కానీ, బీజేపీ నుంచి వచ్చిన అభ్యర్థి జనసేన తరఫున పోటీ చేస్తుండడం గమనార్హం. ఆయన బీజేపీ నుంచి టిక్కెట్ ఎందుకు దక్కించుకోలేకపోయారు.? అన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.
కూకట్‌పల్లి కంటే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రౌండ్ వర్క్ బాగా చేసింది. అక్కడెందుకు జనసేన చివరి నిమిషంలో చేతులెత్తేసి, బీజేపీకి అప్పగించేసిందనే విషయం జనసేన శ్రేణులకీ అర్థం కావట్లేదు.
మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన స్ట్రాంగ్‌గా వుందా.? అంటే, గెలిచేస్తామని జనసేన నేతలు చెబుతున్నా, అంత సీన్ అక్కడ జనసేనకి లేదు. కూకట్‌పల్లి నియోజకవర్గం విషయమై జనసేన చాలా అంచనాలే పెట్టుకుంది. టీడీపీ శ్రేణుల మద్దతు కూడా ఇక్కడ జనసేనకు వుండొచ్చు.