కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి చైబాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2018లో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో, పలు సమన్లకు స్పందించకపోవడంతో కోర్టు ఈ చర్యకు దిగింది. రాహుల్ గాంధీని జూన్ 26న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
ఇది 2018లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో జరిగిన ఘటన. రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి “హత్య కేసులో ఆరోపణలు ఉన్నవాడు కూడా బీజేపీ అధ్యక్షుడవుతాడు” అన్నట్టు మాట్లాడారంటూ, బీజేపీ నేత ప్రతాప్ కతియార్ పరువు నష్టం కేసు వేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలపై దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన కోర్టుకు వివరించారు.
ఈ కేసును మొదట చైబాసాలోని సీజేఎం కోర్టు స్వీకరించగా, తరువాత 2020లో రాంచీ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు, తిరిగి చైబాసాకు బదిలీ అయింది. ఈ వ్యవధిలో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేస్తూ హాజరుకావాలని పదేపదే ఆదేశించింది. కానీ, ఆయన వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో తొలుత బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆపై హైకోర్టులో దాఖలైన స్టే పిటిషన్ కూడా తిరస్కరించబడింది.
తాజాగా, కోర్టు ముందు రాహుల్ తరఫు న్యాయవాది మినహాయింపు పిటిషన్ దాఖలు చేసినా, దానిని తిరస్కరించిన న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న హాజరుకాలేకపోతే, చట్టపరంగా అరెస్ట్ చేయాల్సి వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. రాజకీయంగా ఇది కీలక పరిణామంగా మారనుంది.