నిమ్మగడ్డ రాజకీయ ప్రసంగం

నిన్న వైఎస్సార్ కడప జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్యలో  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రసక్తి దేనికి తీసుకొచ్చినట్లు?  వైఎస్సార్ తనను ఎంతగానో ప్రోత్సహించారని, అభిమానించారని, తరువాత రాజ్ భవన్ కు పంపించారని..ఈ గతకాలపు స్మృతులను ఎన్నికల సమీక్షా సమావేశంలో ప్రస్తావించడం వెనుక పరమార్ధం ఏమిటి?  అంతటితో ఆగకుండా ఆయన సిబిఐ కేసుల విషయాన్నీ ప్రస్తావించారు.  తాను ఇంతకుముందు సిబిఐ కేసుల్లో సాక్ష్యం చెప్పానని,  తాను ప్రధాన సాక్షినని, రేపు మళ్ళీ కోర్టులో నిలబడి సాక్ష్యం చెబుతానని చెప్పుకొచ్చారు.  

నారాయణ్ దత్ తివారి ఉద్వాసన వెనుక….

అసలు ఎన్నికల కమీషనర్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాలి తప్ప వైఎస్సార్ గురించి, సిబిఐ కేసుల గురించి అధికారుల సమావేశంలో  ఎందుకు మాట్లాడినట్లు?  రాజ్ భవన్ లో నిమ్మగడ్డ ఎలా విధులు నిర్వహించారో మనకు తెలియదు కానీ అప్పట్లో ఆయన మీద వ్యతిరేకంగా ఆరోపణలు ఏవీ వినలేదు.  కానీ, నాటి గవర్నర్ నారాయణ్ దత్ తివారి పడకగదిలో జరిగిన కొన్ని వ్యక్తిగత విషయాలను  ఏబీఎన్ ఛానెల్  రహస్య కెమెరాలతో చిత్రించి ప్రసారం చేసి భ్రష్టు పట్టించడంలో  నిమ్మగడ్డ సహకారం ఉన్నదని  ఆరోపణలు వచ్చాయి.  వాటిలో వాస్తవం ఎంతుందో నాకైతే తెలియదు.  

సిబిఐ పేరుతో బెదిరింపులా?

ఇక సిబిఐ కేసులను ప్రస్తావించడం, వాటిలో తాను ప్రధాన సాక్షిని అని,  మళ్ళీ కోర్టుల్లో చెబుతానని  చెప్పడం చూస్తుంటే ఆయన కొందరు ప్రముఖ నేతలను బెదిరిస్తున్నట్లుగా భావించాలి.  తనవద్ద ఏదో అత్యంత కీలకమైన సమాచారం ఉన్నదని, దాన్ని కోర్టుకు అందిస్తే కొందరికి ఉరిశిక్ష పడిపోతుంది అని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా తోస్తున్నది.  గతంలో సిబిఐ ముందు నిమ్మగడ్డ ఏమి సాక్ష్యం పలికారో,  భవిష్యత్తులో ఏమి పలుకబోతున్నారో ఆయనకే తెలియాలి.  మొత్తానికి తనను రెచ్చగొడితే సిబిఐ ముందు తన తడాఖా చూపుతానని హెచ్చరిస్తున్నారా?  

జగన్ ఎవరినైనా బెదిరించారా?

ఇప్పుడు సిబిఐ కేసులు రాష్ట్రంలో ఎవరి మీద ఉన్నాయో అందరికీ తెలుసు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సిబిఐ కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు.  వారిని బెయిల్ మీద బయటకు రాకుండా సిబిఐ పదహారు నెలలపాటు అడ్డుకున్నది.  వారిమీద పచ్చ మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసింది.  వారి వ్యక్తిత్వాలను దునుమాడటానికి విశ్వప్రయత్నాలు చేసింది.  అయినప్పటికీ వారు కేసులను ధైర్యంగా ఎదుర్కొన్నారు తప్ప సాక్షులను ప్రలోభపెట్టడానికి, బెదిరించడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు.  ఈ కేసుల్లో మమ్మల్ని బెదిరించారని వారిమీద ఈరోజు వరకు సాక్షులు ఎవ్వరూ ఆరోపణలు చెయ్యలేదు.  అలాంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ తనవద్ద ఉన్న సాక్ష్యాలను, ఆధారాలను నిర్భయంగా కోర్టుకు సమర్పించవచ్చు.  బోనులో నిలబడి సాక్ష్యం చెప్పవచ్చు.  ఎవరు అడ్డుకున్నారు?  పదేళ్ల నుంచి తనపై వచ్చిన ఆరోపణలపై జగన్ మోహన్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు తప్ప ఎపుడూ ఎవరినీ బెదిరించలేదు.  ఆయనకు న్యాయంగా రావాల్సిన బెయిల్ రానప్పుడు కూడా కోర్టులను నిందించలేదు.  ఇది అందరికీ తెలిసిందే.  

తెలుగుదేశం నీడలో….

నిన్న నిమ్మగడ్డ మాట్లాడిన మాటలు మాత్రం ఆయనవి కావు.  ఒక అధికారిగా ఆయన అలాంటి మాటలు మాట్లాడకూడదు.  అందునా ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయాన ఒక పార్టీ వారిని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడటం అస్సలు కూడని పని.   ఆయన చంద్రబాబు ప్రభావంలో పనిచేస్తున్నట్లు దాచుకున్నా దాగడం లేదు.  మరి నిమ్మగడ్డ అనుచిత వ్యాఖ్యలపై అధికారపార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు