కేసీయార్ కుమార్తె కవిత అరెస్టు తప్పదా.?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపో మాపో అరెస్టు కాబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంటోంది. ఇప్పటికే పలుమార్లు ఆమె ఈ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ మరిన్ని సాక్ష్యాధారాల్ని సేకరించిందంటూ మీడియాలో కథనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈడీ పేర్కొన్న అంశాలంటూ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా, కవిత మాత్రం ఈసారి సైలెంటయ్యారు.

ప్రస్తుతం ఆమె స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారన్నది బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే, రేపో మాపో కవితను ఈడీ పిలవబోతోందనీ, విచారణకు హాజరైతే ఆమె అరెస్టు తప్పదనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘కవిత అరెస్టు తప్పదు.. ఈ స్కామ్‌లో కేసీయార్ పాత్ర కూడా వుంది. ఆయన కూడా అరెస్టవుతారు..’ అంటోంది బీజేపీ. కవిత పేరుని లిక్కర్ స్కామ్‌లో తొలుత తీసుకొచ్చింది బీజేపీనే. అప్పటికి అవి రాజకీయ ఆరోపణలు మాత్రమే.

బీజేపీ ఆరోపణలకు అనుగుణంగానే కవిత పేరు, లిక్కర్ స్కామ్‌లో హైలైట్ అయ్యింది. ఇప్పుడు కవిత అరెస్టు మీద కూడా బీజేపీ చాలా ధీమాగా చెబుతోందంటే.. దానర్థమేంటి.? రేపో మాపో ఆమె అరెస్టు అవ్వొచ్చనే కదా.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. అధికార పార్టీలకు అనుగుణంగా ఆయా విచారణ సంస్థలూ నడుచుకుంటున్నాయని చెప్పక తప్పదేమో.!