లోకంలో ఎవరు మారినా మారకపోయినా మోసగాళ్లు మాత్రం కాలంతో పాటే మారుతుంటారేమో!.. ఎందుకంటే మోసం చేయడానికి ఎప్పటికప్పుడు వాళ్లు ఎంచుకొనే కొత్త కొత్త పద్దతులు నయా ఛీటింగ్ టెక్నిక్కులు చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. పైగా టెక్నాలజీని వీళ్లు వాడుకున్నట్లు ఎంత పెద్ద సాంకేతిక నిపుణుడికైనా సాధ్యం కాదు. అలాంటి బడా 420 గాళ్లే ఎపి సిఎం సహాయనిధి పేరిట భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. అయితే ఇక్కడి బ్యాంకు అధికారుల అప్రమప్తత వల్ల ఆ స్కెచ్ వర్కౌట్ అవ్వలేదు. ఇంతకీ వాళ్లు కొట్టేయ్యాలనుకుంది ఎంతో తెలుసా…అక్షరాలా 112 కోట్ల రూపాయలు…మరి ఛీటర్లా….మజాకా?
ఆపదల్లో ఉండే వారిని ఆదుకోవడానికి సిఎం సహాయ నిధి ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆపన్నులకు సహాయం చేస్తుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రాణాంతకమైన రోగాలకు చికిత్సల కోసం, ఇతర తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు జారీ చేస్తారు. దీంతో ఇలాంటి వారి కోసం ఎల్లప్పుడూ సిఎం సహాయనిధి పేరిట వందల కోట్ల రూపాయలు చెక్కులు విడుదల అవుతుంటాయి. ఇదిగో ఇక్కడే ఎవరో 420 గాళ్లకు కొత్త ఐడియా వచ్చింది. ఇంకేముంది దానికి తగినట్లు స్కెచ్ వేసి రంగంలోకి దిగారు. అది కూడా వస్తే భారీగా డబ్బు వచ్చేటట్లు…లేకుంటే తాము దొరక్కుండా ఉండాలని పెద్ద ప్లానే వేశారు.
దాని ప్రకారం సిఎం సాయం పొందిన లబ్దిదారుల పేరిట నకిలీ చెక్కులు తయారు చేశారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 112 కోట్ల రూపాయలు కొట్టేసేందుకు ఇలా డూప్లికేట్ చెక్కులు తయారు చేశారు. ఇక ఆ తర్వాత వీటిని బ్యాంకుల ద్వారా క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే మళ్లీ ఇక్కడ తమ తెలివి ఉపయోగించారు. ఎపిలో ఈ చెక్కులు మార్చేందుకు ప్రయత్నిస్తే దొరికిపోతామని…అందుకే ఈ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీ,కోల్ కతా,బెంగుళూరు ల్లోని బ్యాంకుల్లో ఈ చెక్కులు డిపాజిట్ చేసి క్యాష్ చేసుకునేందుకు ట్రై చేశారు. ఇలా ఢిల్లీలోని సిసిపిసిఐ బ్యాంకులో రూ.39,85,95,54 చెక్కు, కోల్ కతా పరిధిలోని మోగ్రాహత్ బ్రాంచికి రూ 24.65 కోట్లు చెక్కు, మంగుళూరులోనిమూడ్ బద్రి బ్రాంచ్ లో 52.65 కోట్ల రూపాయలకు చెక్కు దాఖలు చేశారు. ఈ మూడు చెక్కులు విజయవాడ ఎంజి రోడ్ లోని ఎస్బిఐ బ్రాంచ్ కు చెందిన చెక్కులులాగా ఉన్నాయి.
అయితే ఇవి భారీ మొత్తానికి సంబంధించిన చెక్కులు కావడంతో డబ్బు ఇవ్వడానికి ముందు సాధారణంగా ఉండే ప్రొసీజర్ లో భాగంగా ఆ బ్యాంకులు వెలగపూడిలోని ఎస్బిఐ బ్యాంకు ను సంప్రదించడంతో అవి ఫేక్ చెక్కులని బైటపడింది. దీంతో ఇంత భారీ మొత్తంలో డబ్బు కొట్టేయడానికి వేసిన స్కెచ్ తీవ్ర సంచలనం సృష్టించింది. ఏకంగా సిఎం సహాయ నిధినే అడ్డుపెట్టుకొని వందల కోట్లు నొక్కేయాలని చూసిన ఆ బడా ఛీటర్లను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు పని ప్రారంభించారు.