ఆంధ్రప్రదేశ్‌కి ప్రస్తుతానికైతే రాజధాని అమరావతి మాత్రమే. వైఎస్ జగన్ సర్కార్, మూడు రాజధానుల దిశగా కీలకమైన ముందడుగు వేసిందిగానీ, అదిప్పుడు కోర్టు పరిధిలో వుంది. లేకపోతే, ప్రస్తుతం రాష్ట్రానికి మూడు రాజధానులని ప్రస్తావించుకోవాల్సి వచ్చేది. అందులో ఒకటి ప్రస్తుత రాజధాని అమరావతి, దానికి అదనంగా మరో రెండు రాజధానులు విశాఖపట్నం, కర్నూలు. వీటిల్లో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాగా, కర్నూలు జ్యుడీషియరీ క్యాపిటల్. అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్‌గా వైఎస్ జగన్ సర్కార్ అభివర్ణిస్తోంది. వీటితోపాటు మరో క్యాపిటల్ కూడా వచ్చే అవకాశం వుందట. అదే డివోషనల్ క్యాపిటల్. ఈ గౌరవం తిరుపతికి దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ‘రాయలసీమకు కేవలం హైకోర్టు ఇస్తే సరిపోదు.. పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతిని కూడా ఓ రాజధానిగా ప్రకటించాలి..’ అనే డిమాండ్ పెరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబందించి రాజకీయంగా కాక రేగుతున్న తరుణంలో తిరుపతి రాజధాని.. అనే అంవం తెరపైకొస్తోంది.
ఏమో, ఒక రాజధానిని మూడు ముక్కలు చేసినప్పుడు, మూడు రాజధానుల్ని నాలుగుగా మార్చడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు వైఎస్ జగన్ ప్రభుత్వానికి. పైగా, తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి, సిట్టింగ్ లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతదాకా అయినా అధికార వైసీపీ వెళ్ళక తప్పదు. ఆ స్థాయిలో తిరుపతిలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి మరి. తిరుపతి ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్మాత్మిక నగరాల్లో ఒకటి.
హిందువులకు సంబంధించి అతి పెద్ద పుణ్యక్షేత్రమిది. దాంతో, తిరుపతికి డివోషనల్ క్యాపిటల్ అనే హోదా ప్రభుత్వం కల్పిస్తే, అధికార వైసీపీకి అది రాజకీయంగానూ అడ్వాంటేజ్ అవుతుంది. ఒకటి కాదు.. మూడు కాదు, నాలుగు రాజధానులు రాష్ట్రానికి.. చెప్పుకోడానికి బాగానే వున్నా, ఆచరణలో ఇది సాధ్యమేనా.? ‘మీ రాష్ట్ర రాజధాని ఏది.?’ అని ఎవరన్నా అడిగితే, ఇన్ని సమాధానాలు రాష్ట్ర ప్రజలు చెప్పగలరా.? ఒకటి.. మూడుగా మారబోతోంది.. మూడు, నాలుగుగా మారే అవకాశం వుంది. ఆ నాలుగు 13 వరకూ వెళుతుందా.? ఇంకా పెరుగుతుందా.? ఏమో కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది.