Free Ration: ఉచిత రేషన్ పొందుతున్న వారిలో అనర్హులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMJKAY) పథకం కింద లబ్ధిదారుల ఎంపికను మరింత కఠినతరం చేయనుంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను (IT) చెల్లించే వారికి ఇకపై ఉచిత రేషన్ అందించబోమని ప్రభుత్వం యోచిస్తోంది.
లబ్ధిదారుల ఆధార్, పాన్ నంబర్ల ఆధారంగా వారి ఆర్థిక స్థితిని విశ్లేషించి, వారు నిజంగా ఉచిత రేషన్‌కు అర్హులా? అనర్హులా? అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించనుంది. ఈ వివరాలను ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (DFPD) విభాగం ఆదాయపు పన్ను శాఖతో పంచుకుంటుంది. అక్కడి నుండి వచ్చే డేటాను ఆధారంగా చేసుకుని రేషన్ అర్హతను తిరిగి పరిశీలించనున్నారు.
ఈ ప్రక్రియ ద్వారా అనర్హులను గుర్తించి, ఉచిత రేషన్ లబ్ధి పొందడాన్ని నిలిపివేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని వల్ల నిజంగా అవసరమైన పేదలకు మాత్రమే రేషన్ అందుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధిత మార్గదర్శకాలు పంపినట్లు సమాచారం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాదిమంది అనర్హులుగా తేలిపోతారని అంచనా. అయితే, పెరిగిన ఆదాయపు పన్ను పరిధి కారణంగా కొన్ని మధ్యతరగతి కుటుంబాలు ఈ కొత్త నిబంధనల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతో ఉచిత రేషన్ అంశంపై మరోసారి చర్చ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.