లోకేష్ చేతికి కుప్పం.. చంద్రబాబుకి ‘వలస’ తప్పదా.?
కుప్పం నియోజకవర్గం నుంచి ఓటమి పాలవ్వాల్సి వస్తే.? ఆ ఆలోచన అత్యంత భయానకంగా వుంటుంది టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి. సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబుకి ఎదురుగాలి వీస్తోంది. పార్టీ కార్యకలాపాల నిమిత్తం చంద్రబాబు, సొంత జిల్లాకి దూరంగా వుండాల్సి వస్తోంది. సహజంగానే, ఈ దెబ్బ స్థానికంగా గట్టిగా వినిపిస్తుంటుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు ఎంత అందుబాటులో వుండేవారో అందరికీ తెలిసిందే. కానీ, చంద్రబాబు అలా కాదు. కేవలం చుట్టపు చూపుకే పరిమితమవుతూ వచ్చారు. అదే, టీడీపీని చిత్తూరులో దెబ్బకొట్టేసింది. పైగా, ఒకప్పుడున్న బలమైన నేతలు ఇప్పుడు టీడీపీకి లేరు. దాంతో, 2024 నాటికి చంద్రబాబు కొత్త నియోజకవర్గం వెతుక్కోక తప్పేలా లేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, చంద్రబాబు కృష్ణా – గుంటూరు జిల్లాల పరిధిలో ‘అనుకూలంగా వుండే’ నియోజకవర్గం కోసం వెతుకుతున్నారట. గన్నవరం నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మంగళగిరిలో పుత్రరత్నం లోకేష్ ఓడిపోయినా, ముందు ముందు అక్కడ టీడీపీ బలోపేతమవుతుంది గనుక, ఆ నియోజకవర్గంపైనా చంద్రబాబు ఆసక్తితో వున్నారన్నది మరో వాదన.
ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తిరిగి కుప్పం నుంచి పోటీ చేసే అవకాశమే లేదంటూ మీడియా, రాజకీయ వర్గాల్లో గుసగుసలు జోరందుకుంటున్న దరిమిలా, అసలు మీడియాకి లీకులు ఎవరు పంపుతున్నారు.? అన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకే ఈ తరహా లీకులు పంపడంలో ఘనమైన అనుభవం వుంది. లీకులు పంపడం ద్వారా ప్లస్సులు, మైనస్సుల గురించి తెలుసుకుని, తదనుగుణంగా ముందడుగు వేయడం చంద్రబాబు అండ్ టీమ్‌కి కొత్తేమీ కాదు.