అధికారంలో ఉంటే ఒక పాట.. ప్రతిపక్షంలో ఉంటే మరోపాట పాడుతున్నారు టీడీపీ నేతలు. దీంతో… జనాలకు గతం గుర్తుండదు.. జనాలకు అంత తెలివిలేదు అన్నట్లుగా ప్రవర్తించే చంద్రబాబుకి తగ్గట్లుగానే చినబాబు లోకేష్ కూడా మాట్లాడుతున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి. ఏపీకి సీబీఐ రావాలంటూ చినబాబు లోకేష్ చేసిన వ్యాఖ్యలే తాజా కామెంట్లకు కారణంగా ఉన్నాయి.
వివరాళ్లోకి వెళ్తే… 2018లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఏపీకి సీబీఐ రాకూడదని నిర్ణయించుకున్నారు. సీబీఐ పేరు చెబితే బాబు వణికిపోతున్నారని అప్పట్లో విమర్శలు వచ్చినా.. బాబు లైట్ తీసుకున్నారు. ఫలితంగా… కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐకి ఏపీలో దాడులు, దర్యాఫ్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సీబీఐ సంస్థ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. దీనిపై పలువురు నేతలు తీవ్రంగా స్పందించారు.
అయితే నాడు బాబు నిర్ణయంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ… “సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చంద్రబాబు ప్రయత్నం సిగ్గుచేటు అని.. చంద్రబాబు నాయకత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని” ఆరోపించారు. ఇదే క్రమంలో… “ఫెడరల్ వ్యవస్థను బాబు భ్రష్టు పట్టిస్తున్నారని.. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే విచారణకు భయపడుతున్నారని, అందుకే సీబీఐ అంటే వణికిపోతున్నారని” వైకాపా నేతలు విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో చంద్రబాబు & కో లు మౌనాన్నే తమ భాషగా చేసుకుని కాలం వెళ్లబుచ్చారు!
అయితే తాజాగా యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న చినబాబు… పీలేరులోని భూ కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు. పీలేరు భూఆక్రమణలపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. భూ ఆక్రమణల ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని, సీబీఐ రావాల్సిందే అని లోకేష్ అంటున్నారు. దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు!
సీబీఐ అంటే బాబుకి నమ్మకం లేకపోయినా లోకేష్ కి ఉందని భావించాలా? లేక, బాబు అభిప్రాయాలు వేరు – చినబాబు నమ్మకాలు వేరా అని అనుకోవాలా? అంటూ ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు. ఇదే డిమాండ్ ను చంద్రబాబుతో కూడా చేయించాలని… బాబు వేరు – తాను వేరన్నట్లుగా చినబాబు స్టేట్ మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు.
మరి.. ఇంతకూ సీబీఐ ఏపీకి రావాలని చినబాబు కోరుతున్న విషయం చంద్రబాబుకి తెలుసా.. లేదా.. అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారనేదానిపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది!