“చిరంజీవి సలహా మేరకే పవన్ సినిమాల్లో నటిస్తున్నారు. పవన్ కు తన మద్దతును ప్రకటిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు’ అంటూ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చేసిన అత్యుత్సాహపూరిత ప్రకటన విని నవ్వుకోనివారు ఉండరు బహుశా…
నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన రెండువిధాలుగా నవ్వు తెప్పిస్తుంది. జనసేన దుకాణాన్ని పెట్టుకుని ఏడేళ్లయినా ఇంతవరకూ సాధించింది ఏమీ లేదని, అందుకని చిరంజీవి కూడా కలిస్తే కానీ జనసేనకు ప్రాణవాయువు రాదు అన్నట్లుగా ఒకకోణం అయితే, చిరంజీవి స్వయంగా పార్టీ పెట్టి దాన్ని చిల్లర దుకాణంగా మార్చి, టోకున సోనియాగాంధీకి అమ్మేసుకుని ఆమె విదిలించిన ఒక ఎంగిలి బిస్కట్టును నోటకరచుకుని, కొన్నాళ్ళు అనుభవించిన తరువాత, అధికారం కోల్పోగానే సోనియా అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా ఏమాత్రం విశ్వాసం చూపకుండా మళ్ళీ సినిమాలు చేసుకుంటూ కోట్లు గడిస్తున్న చిరంజీవి మద్దతు ఇస్తే జనసేనకు ఎలాంటి లాభం చేకూరుతుందో నాదెండ్ల మనోహర్ కు తెలియదేమో కానీ, ప్రజలకు మాత్రం బాగా తెలుసు. కాపు ముద్ర వేసినా, అందరివాడు అనే ముద్ర వేసుకున్నా, చిరంజీవిని జనం నమ్మలేదు. ఇక మరొక కోణం తాను ఇకపై సినిమాలు చేయబోనని ఎన్నికలముందు గంటకొట్టి చెప్పిన పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడం కేవలం చిరంజీవి సలహా మేరకే తప్ప పవన్ మాటతప్పడం కాదని జనం చెవుల్లో పూలు పెట్టడం.
చిరంజీవి సాధారణ నటుడు కాదు. ఎన్టీఆర్ తరువాత అంతటి ప్రజాదరణను, విజయాలను చూరగొన్న మెగా హీరో. అప్పట్లో చిరంజీవి పార్టీని పెట్టినపుడు రాష్ట్రవ్యాప్తంగా ఎంత హంగామా జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. తిరుపతిలో చిరంజీవి ఎంట్రీ ఒక భారీ బడ్జెట్ సినిమాలో హీరో ఎంట్రీ లెవెల్లో నిర్వహించారు. చిరంజీవి కోసం వేదిక మీద ఎదురు చూస్తున్న భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలను వేదిక పైనుంచి దిగిపొమ్మని అల్లు అరవింద్ అహంకారపు ఆదేశాలు ఆ దంపతులను కనీసం కొన్ని నెలలపాటు నిద్రకు దూరం చేశాయి. చిరంజీవి ఒక్కడే ఈ మూలనుంచి ఆ మూలకు, ఆ మూలనుంచి ఈ మూలకు మైకు పట్టుకుని తిరుగుతూ మాట్లాడుతూ చేసిన విన్యాసాలు, చెప్పిన సినిమా డైలాగులు ఇంకా అందరి నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. స్టేజి నాటకాలలో ఏకపాత్రాభినయం లాగా సాగిపోయిన చిరంజీవిని నమ్మి కోట్ల రూపాయలు నష్టపోయినవారు ఎందరో ఉన్నారు. ప్రజారాజ్యం ఒక విషవృక్షం అని అప్పటి ఆ పార్టీ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం ఆఫీసులోనే పత్రికసమావేశంలో ఈసడించి చక్కా వెళ్లిపోయారు.
ఇక ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. రెండు సీట్లు మినహా అసెంబ్లీలో అన్నీ సీట్లు మావే అని హెచ్చరించిన అల్లు అరవింద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ముఖ్యమంత్రి అవుతాడని కలవరించిన కాపులు, అభిమానుల ఆశలను అడియాసలు చేస్తూ చిరంజీవి సొంత నియోజకవర్గంలో తన జిల్లాలోనే సరిగా తెలియని ఒక మహిళా అభ్యర్థి చేతిలో పరాభవించబడ్డారు. తిరుపతి ప్రజలు కరుణ చూపించడంతో చావుతప్పి కన్ను లొట్టా పోయినట్లు అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. దాంతో ఆయనకు జ్ఞానోదయం అయింది. ప్రజాక్షేత్రం తనకు అచ్చుబాటు కాదని దొడ్డిదారిన రాజ్యసభలో అడుగుపెట్టి కొన్నాళ్లపాటు మంత్రి అనిపించుకున్నారు. తరువాత రాజకీయాలకు స్వస్తి పలికారు. తమ కుటుంబానికి రాజకీయాల్లో విశ్వసనీయత లేకుండా చేసుకున్నారు.
అప్పట్లో యువరాజ్యం అధినేతగా వెలిగిన పవన్ కళ్యాణ్ పదేళ్ల తరువాత ప్రజల మతిమరుపు పట్ల నమ్మకంతో జనసేన అనే మరొక దుకాణాన్ని ఆర్భాటంగా తెరిచారు. చిరంజీవి కొంత నయం. పార్టీ పెట్టిన తరువాత ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ మాత్రం కూడా ముందడుగు వెయ్యకుండా తన దుకాణాన్ని మొదటే అమ్మకానికి పెట్టేశారు. అప్పటినుంచి ఆయనకు ప్యాకేజీరాయుడుగా పేరొచ్చింది. ఆయన చేష్టలు కూడా దాన్ని బలపరచేవిగా ఉన్నాయి. దేశంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తులు అంటూ డ్రామాలు నడిపి చివరకు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు చావగొట్టి చెవులు మూశారు. అన్నయ్య ఒకచోట ఓడిపోతే పవన్ రెండుచోట్ల ఓడిపోయి అన్నకు మంచిపేరు తెచ్చారు.
మొత్తానికి మెగా కుటుంబానికి ప్రజల్లో విశ్వసనీయత అనేది లేకుండా పోయింది. అందుకే ఏ పార్టీలోని అసంతృప్తులు కూడా జనసేన వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికల్లో ఓడిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా ఈరోజువరకు ఆ పార్టీలో పవన్, మనోహర్ తప్ప మరొక నాయకుడే లేడు. ఇప్పుడు పంచాయితీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నా వేళ పార్టీలో ఏమాత్రం చలనం లేకపోవడంతో “చిరంజీవి మా వెంటే ఉంటారని హామీ ఇచ్చారు” అంటూ మనోహర్ చేసిన వెర్రి ప్రకటన హాస్యాస్పదంగా తయారయింది. ఏదీ…నాదెండ్ల ఒకసారి చిరంజీవి నోటితో ఆ మాటను చెప్పించమనండి చూద్దాం! ఎన్ని కాయకల్పచికిత్సలు చేసినా, ఎన్ని ఊరపిచ్చుక లేహ్యాలు తినిపించినా జనసేనకు జవసత్వాలు రావడం అసంభవం…ఒకవేళ తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయిస్తే తప్ప!!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు