మెగాస్టార్ చిరంజీవిని రాజకీయ వివాదాల్లోకి లాగేశారు జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవే కారణమన్నది నాదెండ్ల మనోహర్ ఉవాచ. అంతేనా, పవన్ కళ్యాణ్ వెంట రాజకీయంగా నడిచేందుకు కూడా చిరంజీవి సిద్ధంగా వున్నారంటూ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం జనసేన వర్గాల్ని సైతం షాక్‌కి గురిచేసింది. అన్నయ్య చిరంజీవికీ, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కీ ఆలోచనల పరంగా వ్యత్యాసం వుంది. ‘మా ఇద్దరి అభిప్రాయాలూ కలవవు. మేం, రైలు పట్టాల్లాంటోళ్ళం. అయితే, మా అంతిమ లక్ష్యం మాత్రం ఒకటే. మా గమ్యం, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు సేవ చేయడం..’ అని చిరంజీవి చాలా సందర్భాల్లో కుండబద్దలుగొట్టేశారు.
జనసేన పార్టీ కోసం నాగబాబు ప్రత్యక్షంగా, చరణ్ అలాగే అల్లు అర్జున్ పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తే.. చిరంజీవి ఇంతవరకు జనసేనకు అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. అలాగని జనసేన అంటే ఆయనకు గిట్టదని అనుకోలేం. పవన్ అభిమానులు కావొచ్చు, జనసైనికులు కావొచ్చు.. చిరంజీవి నుంచి ‘మద్దతును’ కూడా ఆశించడంలేదు. ‘అన్నయ్య రాజకీయాలకు దూరంగా వున్నారు. ఆయన్ని వివాదాల్లోకి లాగొద్దు..’ అని పలుమార్లు జనసైనికులకీ, జనసేన ముఖ్య నేతలకీ పవన్ కళ్యాణ్ సూచించారు కూడా. మరి, నాదెండ్ల మనోహర్ ఎందుకు చిరంజీవి పేరుని లాగినట్లు.? ప్రస్తుతం చిరంజీవి సినీ రంగంలో బిజీగా వున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయనే పెద్దన్న ఇప్పుడు. ‘అందరివాడు’ అన్పించుకుంటున్న చిరంజీవిని, కొందరివాడుగా మార్చేసేలా నాదెండ్ల మనోహర్ ప్రకటన వుందన్న చర్చ అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నాదెండ్ల మనోహర్‌కి వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలియడంలేదని ఎలా అనుకోగలం.? ఆయన ఉద్దేశ్యం ఏదైనా, జనసేనకు ఈ వ్యాఖ్యలు సంకటంగా మారాయి. ప్రత్యర్థులకు ఆయుధాన్నిచ్చినట్లయ్యింది జనసేన మీద మాటల దాడి చేసేందుకు.. అదే సమయంలో, చిరంజీవిని రాజకీయంగా ఇరకాటంలో పడేసేందుకు.