హనీమూన్ అనేది ప్రేమను మరింత చేసుకునే సమయంలో. అయితే అదే హనీమూన్ ఒక యువకుడికి ప్రాణాంతకంగా మారుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన సోనమ్ రఘువంశీ కేసు ఎన్నో మలుపులతో ఆలోచనలో పడేసేలా చేస్తోంది. భర్తను హనీమూన్ పేరుతో తీసుకెళ్లి, ప్రేమికుడితో కలిసి చంపేసిన అమానుషానికి ఈ కేసు నిదర్శనంగా మారింది.
భర్త రాజా రఘువంశీతో నూతనంగా వివాహం జరిగిన తరువాత సోనమ్ మేఘాలయకు హనీమూన్‌కు వెళదాం అని చెప్పింది. అక్కడే తన ప్రియుడు రాజ్ కుష్వాహా సహాయంతో దారుణమైన ప్లాన్‌ను అమలు చేసింది. మే 23న రాజా కనిపించకుండా పోగా.. జూన్ 2న మేఘాలయ ఖాసీ కొండల్లో అతడి శవం గుర్తించారు. దాంతో కేసు మలుపు తిరిగింది. చివరికి జూన్ 8న నిందితురాలు సోనమ్ యూపీలో పోలీసులకు లొంగిపోయింది. అప్పుడే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల విచారణలో బయటపడ్డ వివరాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. రాజాను ఒక్కసారిగా చంపలేదు. నిందితులు ఈ హత్యను చేయడానికి నాలుగు సార్లు ప్రయత్నించారని వెల్లడైంది. మొదటి సారి గౌహతిలోనే హత్య చేయాలనుకున్నారు. కానీ ప్లాన్ ఫెయిల్ అయింది. తరువాత మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో మరోసారి ప్రయత్నించారు. మృతదేహాన్ని పారేయడం సాధ్యం కాక విఫలమయ్యారు. మూడోసారి నోంగ్రియాట్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో హత్య చేయాలనుకున్నారు. కానీ సమయం కుదరకపోయింది. చివరకు నాలుగో ప్రయత్నంలో, వీసావ్‌డాంగ్ జలపాతం వద్ద రాజాను హత్య చేశారు.
ఈ దారుణానికి ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను సైతం నియమించారు. ప్రేమ పేరుతో పుణ్యభూమి మేఘాలయలో జరిగిన ఈ అమానుషం అందరినీ షాక్‌కు గురిచేసింది. జీవిత భాగస్వామినే నమ్మకంగా వెంట తీసుకెళ్లి, హత్య చేసి పారేసిన ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు మరిన్ని మలుపులు తీయే అవకాశముందని విచారణాధికారులు పేర్కొంటున్నారు.